Begin typing your search above and press return to search.

సీఎం ఆఫీసు కాపు వేదికైపోయింది..

By:  Tupaki Desk   |   13 Jun 2016 7:07 AM GMT
సీఎం ఆఫీసు కాపు వేదికైపోయింది..
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కార్యాలయం ఇప్పుడు కాపు ఉపన్యాసాలకు వేదికగా మారిపోయింది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తెలియచెప్పడానికి వినియోగించుకోవలసిన ముఖ్యమంత్రి కార్యాలయంలోని మీడియా పాయింట్‌ను కాపు ఉద్యమ వేదికగా వాడుకుంటున్నారు. ప్రభుత్వంలోని కాపు మంత్రులు - టీడీపీలోని కాపు నేతలు సీఎం కార్యాలయ మీడియా పాయింట్ నుంచే కాపు అంశాలపై మాట్లాడుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టిన తరువాత, ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని చల్లార్చేందుకు, అలాగే, ముద్రగడపై ఎదురు దాడికి... ప్రభుత్వం కాపులకు ఏం చేస్తోందో చెప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంత్రులు - సీనియర్ కాపు లీడర్లు రోజూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అయితే.. సాధారణ రోజుల్లో, ఇతర అంశాలపై ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు తమ ప్రాంతాలు, లేదంటే పార్టీ ఆఫీసులు వంటి చోట్ల నుంచి మాట్లాడుతారు. కానీ. ముద్రగడ విషయంలో మాత్రం అంతా సీఎం ఆఫీసు కేంద్రంగానే తమ ప్రెస్ మీట్లు సాగిస్తున్నారు. మంత్రులు చినరాజప్ప - నారాయణ - గంటా శ్రీనివాసరావు తదితరులు సిఎంఓ మీడియా పాయింట్ నుంచే రోజూ కాపు ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. మంత్రులే కాదు - బోండా ఉమతోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా సిఎంఓ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నారు.

కేవలం ఒక సామాజికవర్గానికి సంబంధించిన అంశాలపైనే సీఎంఓ నుంచి మాట్లాడడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సామాజిక వర్గానికి ప్రభుత్వం చేసిన, చేయబోతున్న ప్రయోజనాల గురించి చెప్పడంతో సరిపెట్టకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతుండడంతో సీఎం కార్యాలయమంటే కాపులకు వ్యతిరేకమన్న భావన వ్యాపిస్తోంది. అయితే.. చంద్రబాబు మాత్రం కాపు ఉద్యమం గురించి ఇప్పటి వరకూ సిఎం కార్యాలయం నుంచి మాట్లాడలేదు. ముద్రగడ ఉద్యమం ప్రారంభించిన తరువాత ఆయన కడపలో జరిగిన విలేఖరుల సమావేశంలోనే మాట్లాడారు తప్ప, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడలేదు. విజయవాడలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ అంశంపై మాట్లాడవలసినవారంతా ప్రభుత్వ అధికార కార్యాలయం నుంచి మాట్లాడ్డంపై విమర్శలు వస్తున్నాయి.