Begin typing your search above and press return to search.

హమ్మయ్యా..ఈ తమ్ముడు ఇంటికొచ్చాడబ్బా!

By:  Tupaki Desk   |   27 Sep 2019 3:42 PM GMT
హమ్మయ్యా..ఈ తమ్ముడు ఇంటికొచ్చాడబ్బా!
X
నెల రోజుల పాటు ఇంటికి - కుటుంబానికి - తనకు వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ శ్రేణులకు దూరంగా ఉండటమంటే మాటలు కాదు కదా. ఎంత కష్టమొస్తేనో ఈ తరహా వనవాసం తప్పదు కదా. నిజమే... ఇలాంటి కష్టమే టీడీపీ యంగ్ టర్క్ - శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మాజీ ఎమ్మెల్యే - టీడీపీ హయాంలో ప్రభుత్వ విప్ గా ఓ వెలుగు వెలిగిన కూన రవికుమార్ కు కూడా వచ్చేసింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కాగానే... కూనకు కష్టాలు మొదలయ్యాయి. టీడీపీతో పాటు తాను కూడా ఓడినా... విప్ గా వ్యవహరించిన కూనకు తన పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు. అందుకేనేమో... ఏకంగా అధికారుల పైనే దురుసుగా వ్యవహరించారు. ఇంకేముంది కేసు నమోదు కాగానే... అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బెయిల్ కోసం నానా పాట్లూ పడ్దారు. చివరికి బెయిల్ వచ్చేసరికి నెల రోజుల సమయం పట్టింది. అంతే... బతుకు జీవుడా అంటూ కూన నెల రోజుల వనవాసం వీడి ఇంటికి చేరారు.

తన నియోజకవర్గం పరిధిలోని సరుబుజ్జిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటే... టీడీపీ శ్రేణులకు అన్యాయం జరుగుతోందన్న సమాచారం అందుకున్న కూన... మందీ మార్బలాన్ని వెంటేసుకుని అక్కడ ప్రత్యక్షమయ్యారు. వచ్చీ రాగానే మొన్నటిదాకా తనకు దండాలు పెట్టిన అధికారులు... ఇప్పుడు తన అనుచర వర్గానికే వ్యతిరేకంగా వ్యవహరిస్తారా? అంటూ చిందులు తొక్కారు. సర్దిచెప్పేందుకు యత్నించిన ఎంపీడీఓపై దురుసుగా వ్యవహరించారు. అధికారి అని కూడా చూడకుండా ఎంపీడీఓను బెదిరించారు. కూన వెంట ఉన్న కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. వ్యవహారం మీడియా చెవిన పడింది. ఇంకేముంది... అధికారులపై కూన దౌర్జన్యం చేశారంటూ వార్తలు వచ్చేశాయి. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అక్కడికి ఎంట్రీ ఇచ్చాయి. ఎంపీడీఓ ఫిర్యాదుతో పోలీసులు కూనపై కేసు నమోదు చేశారు.

అంతే... ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో కూన రవికుమార్ ఒక్కసారిగా కనబడకుండా పోయారు. అండర్ గ్రౌండ్ లో ఉంటూనే బెయిల్ కోసం తనదైన శైలి యత్నాలు చేశారు. కూనకు బెయిల్ ఇప్పించేందుకు టీడీపీ వర్గాలు కూడా బాగానే యత్నించాయి. అయితే కూనకు జిల్లా స్థాయి కోర్టులో బెయిల్ లభించలేదు. బెయిల్ దొరకకుండా ఇంటికి వస్తే... అరెస్ట్ తప్పదని భావించిన కూన... బెయిల్ వచ్చేదాకా ఇంటికి దూరంగానే ఉండిపోయారు. వనవాసంలో ఉంటూనే మరోమారు బెయిల్ కోసం యత్నించారు. హైకోర్టును ఆశ్రయించారు. ఈ సారి హైకోర్టు ఆయనను కనికరించి బెయిల్ ఇచ్చేసింది. బెయిల్ వచ్చిందన్న వార్తలు విన్నంతనే కూన తన ఇంటికి పరుగు పరుగున వచ్చేశారు. మొత్తంగా తన దురుసు వర్తన కారణంగా ఏకంగా నెల రోజుల పాటు కూన తన ఇంటికి - కుటుంబ సభ్యులకు - పార్టీ శ్రేణులకు నెల పాటు దూరంగా ఉండాల్సి వచ్చిందన్న మాట.