Begin typing your search above and press return to search.

దెబ్బ‌లు క‌నిపించ‌కుండా సీఐడీ పోలీసులు కొట్టారు: టీడీపీ నేత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

By:  Tupaki Desk   |   14 Oct 2022 4:36 AM GMT
దెబ్బ‌లు క‌నిపించ‌కుండా సీఐడీ పోలీసులు కొట్టారు: టీడీపీ నేత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై సీఐడీ పోలీసుల దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌పై అరెస్టు చేయ‌డం, ఈ క్ర‌మంలో ఎలాంటి నోటీసులు ఇవ్వ‌క‌పోవ‌డం, అర్ధ‌రాత్రి పూట గోడలు దూకి, గేట్లు బ‌ద్ద‌లు కొట్టి ఉగ్ర‌వాదుల‌ను చేసిన‌ట్టు అరెస్టు చేయ‌డం, ఈ క్ర‌మంలో మ‌హిళ‌లు, చిన్నారుల‌పైనా దౌర్జ‌న్యం చేయ‌డం, అరెస్టు చేశాక పైకి క‌నిపించ‌కుండా దారుణంగా కొట్ట‌డం, అరెస్టు విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌క‌పోవ‌డం, అరెస్టు చేసి ఎక్క‌డ ఉంచార‌నే స‌మాచారం లేకుండా చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఏపీ సీఐడీ పోలీసుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఏపీ సీఐడీ వైఎస్ జ‌గ‌న్ జేబు సంస్థ‌గా మారిందని మండిప‌డుతున్నారు.

తాజాగా సామాజిక మాధ్యమాల్లో త‌ప్పుడు పోస్టులు పెట్టార‌ని టీడీపీ మీడియా ఇన్‌ఛార్జి దారపునేని నరేంద్రను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను అధికారులు హింసించినట్టు తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కంటికి కనిపించ‌కుండా దెబ్బ‌లు కొట్టార‌ని.. జండూ బామ్ రాసి మరీ కొట్టార‌ని దార‌పునేని న‌రేంద్ర క‌న్నీరు పెట్టారు.

నరేంద్రను సీఐడీ కార్యాలయం నుంచి గుంటూరులోని సీఐడీ న్యాయస్థానానికి తీసుకొచ్చిన సమయంలో ఆయనను టీడీపీ నేత‌లు, న్యాయ‌వాదులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ నేత‌ల దార‌పునేని న‌రేంద్ర క‌న్నీరు పెట్టార‌ని తెలుస్తోంది. త‌న‌ను అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హింసించారని.. ఐదుగురు వ్యక్తులు దెబ్బ‌లు బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా త‌న‌ను చిత‌క‌బాదార‌ని టీడీపీ నేత‌ల‌కు తెలిపారు.

కాగా సీఐడీ అధికారులు కోర్టుకు వచ్చే సరికి కోర్టు సమయం ముగిసిపోయింది. దీంతో న్యాయమూర్తి అనుమతితో నరేంద్రను జడ్జి ఇంటికి తీసుకెళ్లి ఆయ‌న ముందు ప్ర‌వేశ‌పెట్టారు. అంతేకాకుండా నరేంద్రను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే సందర్భంలో పోలీసులు ఆ ప్రాంతంలో ఆంక్షలు సైతం విధించ‌డం గ‌మ‌నార్హం. న్యాయమూర్తి నివాసానికి వెళ్లే మార్గాలను సైతం మూసివేశారు.

న్యాయమూర్తి ముందు ప్ర‌వేశ‌పెట్ట‌డానికి ముందు న‌రేంద్రను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ కార్యాలయం వద్ద మీడియా, టీడీపీ నేత‌లు ఉండటంతో సీఐడీ అధికారులు కార్యాలయం వెనుక వైపు మార్గం నుంచి జీజీహెచ్‌కు త‌ర‌లించారు.

కాగా దారపునేని నరేంద్రకు బెయిల్‌ లభించింది. గురువారం అర్ధరాత్రి 2 గంటలకు నరేంద్రను సీఐడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి వైద్యుల నివేదికను అంద‌జేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నరేంద్రకు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు.

కాగా గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించి సీఎంఓ (ముఖ్య‌మంత్రి కార్యాల‌యం)లోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందని వాట్సప్‌ గ్రూపులో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారన్న ఆరోపణలతో నరేంద్రను సీఐడీ బుధ‌వారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.