Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్సీపై తీవ్ర ఆరోప‌ణ‌లు

By:  Tupaki Desk   |   23 Dec 2018 8:34 AM GMT
టీడీపీ ఎమ్మెల్సీపై తీవ్ర ఆరోప‌ణ‌లు
X
గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్ పై తాజాగా తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వ భూమిని బ్యాంకుకు త‌న‌ఖా పెట్టి ఆయ‌న రుణం పొందిన‌ట్లు ప‌లువురు ఆరోపిస్తున్నారు. మొత్తం రూ.24 కోట్ల రుణాన్ని అక్ర‌మంగా తీసుకునేందుకు స‌తీశ్ రంగం సిద్ధం చేసుకున్నార‌ని.. ఇప్ప‌టికే రూ.5 కోట్ల త‌న ఖాతాలో వేసేసుకున్నార‌ని చెబుతున్నారు.

గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజిలి గ్రామంలోని ప్రభుత్వ భూములను స్థానిక రైతులు సాగు చేసుకుంటున్నారు. రైతులను బెదిరించి ఆ 11.66 ఎకరాల భూమిని త‌క్కువ మొత్తానికి స‌తీశ్ చేజిక్కించుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లొస్తున్నాయి. నిజానికి అవి ప్ర‌భుత్వ భూములు కాబ‌ట్టి వాటిని విక్ర‌యించే అధికారం రైతుల‌కు లేద‌ని - స‌తీశ్ కూడా కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని ప‌లువురు సూచిస్తున్నారు. అయితే - స్వ‌ల్ప మొత్తం రైతుల‌కు చెల్లించి.. ఆ భూముల‌ను ‘సతీష్‌ మెరైన్‌ ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరిట రిజిస్టర్‌ చేసుకున్నార‌ట‌.

ప‌లువురి ఆరోప‌ణ‌ల ప్ర‌కారం.. స‌తీశ్ రైతుల నుంచి భూమి తీసుకున్న త‌ర్వాత రెవెన్యూ అధికారుల‌ను బెదిరించి, సంబంధిత స‌ర్వే నెంబ‌ర్లు నిషేధిత భూముల జాబితాలో లేకుండా చేశార‌ట‌. 11.66 ఎకరాలకు 1బి (భూ యాజమాన్య హక్కు నిర్దారించే పత్రం) పొందారట‌. ఆపై ఈ ఏడాది అక్టోబర్‌ 8న ఎస్‌బీఐలో స‌ద‌రు భూమిని తనఖా పెట్టార‌ట‌. తన కంపెనీ ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి రూ. 24 కోట్లు రుణం కావాలని కోరార‌ట‌. అధికార ప‌క్ష నేత - ఎమ్మెల్సీ కావ‌డంతో అడిగిన వెంట‌నే స‌తీశ్ కు బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేశార‌ట‌. తొలి విడ‌త‌గా రూ.5 కోట్ల‌ను ఆయ‌న ఖాతాలో వేసేశార‌ట‌. మిగ‌తా డ‌బ్బును కూడా ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

అయితే - బ్యాంకు రుణం మంజూరయ్యే వరకు 11.66 ఎకరాలకు 1బి పత్రం మీ సేవలో ఆన్‌లైన్‌లో కనిపించింద‌ని, తర్వాత తాము ఇరుక్కుంటామని తెలిసి రెవెన్యూ అధికారులు 1బిలో గుట్టు చప్పుడు కాకుండా మార్పులు చేశార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. స‌తీశ్ కు తొలుత ఇచ్చిన‌ ఖాతా నెంబ‌రు 3310 కింద 11.66 ఎక‌రాలు ఉండ‌గా.. ఇప్పుడు ఆ నెంబ‌రు కింద 4.15 ఎక‌రాలు మాత్ర‌మే చూపిస్తోంద‌ట‌. ఆ 4.15 ఎక‌రాలు కూడా ప్ర‌భుత్వ భూమేన‌ని స్ప‌ష్టం చేస్తోంద‌ట‌. ఈ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం గుంటూరులో తీవ్ర దుమారం రేపుతోంది. బ్యాంకుల‌కు కుచ్చుటోపీ పెట్టిన‌ట్లు ఇప్ప‌టికే టీడీపీ నేత‌లు సుజ‌నా చౌద‌రి, గంటా శ్రీ‌నివాస‌రావు వంటి వారిపై ఆరోప‌ణ‌లు రాగా.. స‌తీశ్ పై కూడా ఆరోప‌ణ‌లు నిజ‌మే అయితే టీడీపీకి త‌ల‌నొప్పి త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.