Begin typing your search above and press return to search.

భూకుంభకోణం కేసులో టీడీపీ నేత అరెస్ట్

By:  Tupaki Desk   |   20 May 2020 10:30 AM GMT
భూకుంభకోణం కేసులో టీడీపీ నేత అరెస్ట్
X
గత చంద్రబాబు పాలనలో రాజధాని పేరిట టీడీపీ నేతలు అమరావతి భూముల్లో పాగావేసిన తీరు.. అక్కడి రైతులను మోసం చేసి చేజిక్కించుకున్న భూములపై వైసీపీ నేతలు ఆధారాలతో సహా కుంభకోణాలను బయటపెట్టారు. దానిపై ప్రభుత్వం సిట్ విచారణ కూడా వేసింది.

తాజాగా అమరావతి భూ కుంభకోణం కేసులో ఒక టీడీపీ నేతను సిట్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది.అమరావతి రాజధాని పరిధిలోని నెక్కళ్లు గ్రామంలో ఈ భూకుంభకోణం వెలుగుగూసింది.

గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో కొందరు టీడీపీ నేతలు దొంగపత్రాలు సృష్టించి లేని భూమిని ఉన్నట్టు చూపి ప్లాట్లు పొందారు. దీనికి తోడు అసలైన రైతుకు సీఆర్డీఏ సర్వేలో తక్కువ విస్తీర్ణం చూపించారు. టీడీపీ నేతలకు మాత్రం అసలు భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణం, భూమి లేకపోయినా ఉన్నట్టు చూపి ప్లాట్లు పొంది లాభాలు గడించారు.

దీంతో తమ భూమిని టీడీపీ నేతలు కాజేశారంటూ నెక్కళ్లు గ్రామానికి చెందిన అసలు రైతులు గతంలో తూళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దార్ తూళ్లూరు సీఐకి సిఫారసు చేయగా.. సిట్ విచారణ చేపట్టింది.

ఈ కేసును విచారించిన అధికారులు తాజాగా నెక్కళ్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రావెల గోపాలకృష్ణను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు అధికార వర్గాల సమాచారం.

అమరావతి భూకుంభకోణంలో టీడీపీ నేతల అరెస్ట్ పర్వంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఇందులో భారీగా అవకతవకలు జరగడంతో తమ మెడకు ఎప్పుడు చుట్టుకుంటుందోనన్న ఆందోళన టీడీపీ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.