Begin typing your search above and press return to search.

అనంతలో టీడీపీకి షాకిచ్చిన రెబల్!

By:  Tupaki Desk   |   2 April 2019 11:48 AM GMT
అనంతలో టీడీపీకి షాకిచ్చిన రెబల్!
X
మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉంటూ అనంతపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి వ్యతిరేక వర్గంలో యాక్టివ్ గా ఉండిన జయరాం నాయుడు ఇప్పుడు టీడీపీ వ్యతిరేకిగా మారారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కకూడదని గట్టిగా వాదించిన అనంతపురం తెలుగుదేశం నేతల్లో జయరాం నాయుడు ఒకరు. వాస్తవానికి ప్రభాకర్ చౌదరికి మళ్లీ టికెట్ దక్కనీయకూడదని చాలా మంది ప్రయత్నించారు.

వారిలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి - అనంతపురం అర్బన్ లో యాక్టివ్ పొలిటీషియన్లు అయిన సైపుల్లా వర్గం - ఇంకా జయరాం నాయుడు లాంటి వాళ్లంతా చౌదరికి టికెట్ ఇవ్వకూడదని బాబుకు తెగేసి చెప్పారు. అయితే అంతమంది వ్యతిరకిస్తున్నా చంద్రబాబు నాయుడు చౌదరికే టికెట్ ఇచ్చారు. దాని వెనుక వేరే కథ ఉంది. ఒకవేళ ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోతే ఆయన సింపుల్ గా రెబల్ గా నామినేషన్ వేస్తారు.

అలాంటిది ముందు కూడా జరిగింది. గతంలో తనకు టికెట్ దక్కని సమయంలో టీడీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి పార్టీ ఓటమికి కారణం అయ్యాడు ప్రభాకర్ చౌదరి. అందుకే ఈ సారి బాబు ఆయనకే టికెట్ ఇచ్చేశారు. మిగతావారంతా సహకరించాలని బాబు స్పష్టం చేశారు.

వారు ఏం సహకరిస్తారో..అనంతపురం అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ ఫలితం ఎలా ఉంటుందో కానీ.. ఇప్పుడు జయరాం నాయుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. తన వర్గం వారితో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి అనుకూలంగా జయరాం నాయుడు ప్రచారం మొదలుపెట్టారని తెలుస్తోంది.

ప్రభాకర్ చౌదరిని ఓడించడమే ఈయన ధ్యేయంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బోలెడంత అసంతృప్తి గ్యాంగ్ చౌదరికి వ్యతిరేకంగా ఉండటంతో.. అనంతపురం అర్బన్ సీటు ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తిదాయకంగా మారింది!