Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబులో ఈ మార్పు మంచిదేనా?

By:  Tupaki Desk   |   19 Aug 2022 10:30 AM GMT
చంద్ర‌బాబులో ఈ మార్పు మంచిదేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నికల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా టీడీపీ దూకుడు పెంచింది. మే 28, 29 తేదీల ముందు వ‌ర‌కు కొంత ఆ పార్టీ స్త‌బ్ధుగా ఉంది. అయితే ఈ తేదీల్లో నిర్వ‌హించిన పార్టీ మ‌హానాడు అంచ‌నాల‌కు మించి స‌క్సెస్ కావ‌డంతో మంచి జోష్‌లో ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

మ‌హానాడు ఇచ్చిన ఊపుతో బాదుడే బాదుడు, జిల్లాల్లో మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాల‌తో రెట్టించిన ఉత్సాహంతో ఉర‌క‌లేస్తోంద‌ని అంటున్నారు. బాదుడే బాదుడుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు వివిధ జిల్లాల్లో చేసిన ప‌ర్య‌ట‌న‌లకు మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని అంటున్నారు.

మ‌రోవైపు చంద్ర‌బాబు నాయుడులో వ‌చ్చిన మార్పును చూసి టీడీపీ నేత‌లే ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని అంటున్న‌రు. సాధార‌ణంగా ఆయ‌న ఎన్నిక‌ల ముందు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌ర‌ని గుర్తు చేస్తున్నారు. ఎన్నో అంచ‌నాలు, సామాజిక స‌మీక‌ర‌ణాలు, అభ్య‌ర్థి నేప‌థ్యం, గెలుపోట‌ముల స్థితి, వివిధ స‌ర్వేల నివేదిక‌లు ఇలా వివిధ అంశాల‌పై ఆయ‌న అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తార‌ని చెబుతున్నారు. అది కూడా ఎన్నిక‌లకు కొద్ది రోజుల ముందు మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేవార‌ని గుర్తు చేస్తున్నారు. అప్ప‌టివ‌ర‌కు ఏ ఒక్క‌రికీ అభ్య‌ర్థిత‌త్వాన్ని ఖ‌రారు చేసేవార‌ని కాద‌ని వివ‌రిస్తున్నారు.

అయితే ఇప్పుడు మాత్రం చంద్ర‌బాబు కొత్త పంథాకు శ్రీకారం చుట్టార‌ని స్వ‌యంగా టీడీపీ నేత‌లే చెబుతుండ‌టం విశేషం. బాదుడే బాదుడు, మినీ మ‌హానాడుల కోసం జిల్లాల్లో పర్య‌టిస్తున్న చంద్రబాబు ఎక్క‌డిక‌క్క‌డే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు రోజూ ఐదారు నియోజ‌క‌వ‌ర్గాల‌పై అక్క‌డి పార్టీ ఇన్‌చార్జుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ప‌రిస్థితులు, గెల‌వ‌డానికి ఉన్న అవ‌కాశం, పార్టీప‌రంగా ఉన్న స‌మ‌స్య‌లు, ఇత‌ర పార్టీల ప‌రిస్థితి ఇలా వివిధ అంశాల‌ను ఆయ‌న తెలుసుకుంటున్నార‌ని వివ‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలో పార్టీల ఇన్‌చార్జుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయా నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసే అభ్య‌ర్థి మీరేన‌ని.. జాగ్ర‌త్త‌గా ప‌నిచేసుకోవాల‌ని సూచిస్తున్నార‌ని చెబుతున్నారు. ఈ రెండేళ్లు ప్ర‌జ‌ల‌తోనే ఉండాల‌ని, విస్తృతంగా గ్రామాల్లో ప‌ర్య‌టించాల‌ని సూచిస్తున్న‌ట్టు స‌మాచారం. అదేవిధంగా బాదుడే బాదుడు, మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డంతో పార్టీ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మాన్ని కూడా వేగ‌వంతం చేయాల‌ని చంద్ర‌బాబు ఆదేశిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం పార్టీ నేతల వంతవుతోంద‌ని చెబుతున్నారు.

ఎన్నిక‌లకు కొద్ది రోజుల ముందు కానీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌ని చంద్ర‌బాబు రెండేళ్ల ముందుగానే గ‌ట్టి అభ్య‌ర్థులు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వారినే అభ్య‌ర్థులుగా ఖ‌రారు చేస్తున్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబులో వ‌చ్చిన మార్పు మంచిదేన‌నే చ‌ర్చ ఆ పార్టీలో సాగుతోందని స‌మాచారం.