Begin typing your search above and press return to search.

రౌడీ ఎమ్మెల్యే.. దివ్యాంగుడని కూడా చూడలేదు.

By:  Tupaki Desk   |   22 Jun 2018 4:32 AM GMT
రౌడీ ఎమ్మెల్యే.. దివ్యాంగుడని కూడా చూడలేదు.
X

టీడీపీ ఎమ్మెల్యే - ప్రభుత్వ విప్ చింతమనేని ఆగడాలు పెరిగిపోతున్నాయి. న్యాయం చేయాలని ఇంటికి వచ్చిన దివ్యాంగుడిపై దాడికి పాల్పడి విపరీతంగా కొట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. చింతమేనని కొట్టిన చెంప దెబ్బలకు కళ్లు తిరిగి కిందపడిపోయాడు దివ్యాంగుడు. కాళ్లతో తన్నీ మరి కసి తీర్చుకున్నాడు ఎమ్మెల్యే. అక్కడితో ఆగకుండా అడ్డువచ్చిన 70 ఏళ్ల వృద్ధ తల్లిని కూడా కొట్టాడు. 80 ఏళ్ల వృద్ధ తండ్రిని కడుపులో కాళ్లతో తన్నాడు. ఎమ్మెల్యే దెబ్బలకు తీవ్ర అస్వస్థతకు గురైన దివ్యాంగుడు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వైద్యులను మేనేజ్ చేశాడో ఏమోకానీ.. పైకి దెబ్బలు కనిపించడం లేదని మెడికల్ లీగల్ కేసు చేయలేమని దివ్యాంగుడిని ఇంటికి పంపించేయడం దుమారం రేపింది.

పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు గ్రామ కాసీ కాలనీకి చెందిన దివ్యాంగుడు సంపంగి సింహాచలం తన కాలనీలో కిళ్లీ కొట్టు పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సింహాచలం ఇంటిలో అద్దెకు దిగిన ఈదుపల్లి రామారావు అనే వ్యక్తి దివ్యాంగుడిని బయటకు పంపించి ఇంటిని ఆక్రమించాడు. దీనిపై సింహాచలం పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. ప్రస్తుతం వివాదం కోర్టులో ఉంది.

తనకు ఎమ్మెల్యే చింతమనేని అండగా ఉన్నాడని సింహాచలాన్ని ఈదుపల్లి రామారావు బెదిరించాడు. స్థానిక సీఐ కూడా ఈ విషయాన్ని ఎమ్మెల్యే వద్దే తేల్చుకోవాలని సింహాచలంకు సూచించాడు. దీంతో గురువారం ఎమ్మెల్యే చింతమనేని ఇంటికి సింహాచలం అతడి తల్లిదండ్రులు రంగారావు - అప్పలనర్సమ్మ లు కలిసి వెళ్లారు. న్యాయం చేయాలని కోరగా శివాలెత్తిన చింతమనేని.. సింహాచలంపై చేయిచేసుకొని చెంపలపై గట్టిగా కొట్టాడు. అడ్డువచ్చిన తల్లి - తండ్రి డొక్కల్లో బలంగా తన్నారు. సింహాచలాన్ని తన్నుతూ దుర్భాషలాడుతూ ‘నీకు దిక్కున్న చోట చెప్పుకోవాలని హెచ్చరించాడు. సింహాచలాన్ని అతన్ని తల్లిదండ్రులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లినా అక్కడ పట్టించుకోలేదు. చింతమనేని దౌర్జన్యంపై ఏలూరు త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.