Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌ల‌తోనే నిద్ర‌.. అందుకు నిర‌స‌న‌గా!

By:  Tupaki Desk   |   12 Dec 2021 7:30 AM GMT
ప్ర‌జ‌ల‌తోనే నిద్ర‌.. అందుకు నిర‌స‌న‌గా!
X
ప్ర‌తిప‌క్షంలో ఏ పార్టీ ఉన్నా ప్ర‌జ‌ల స‌మ‌స్యల కోసం పోరాడి వాళ్ల మ‌ద్ద‌తు సంపాదించేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాయి. అధికార ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడ‌తాయి. అందుకు ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు త‌లో మార్గాన్ని ఎంచుకుంటారు. కొంత‌మంది ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేస్తే.. మ‌రికొంత మంది దీక్ష‌లు, స‌భ‌లంటూ హడావుడి చేస్తారు. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ‌నేయులు తాజాగా నిర‌స‌న తెలిపిన విధానం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న ఓ కాల‌నీకి వెళ్లి రాత్రి అక్క‌డే స్థానికుల‌తో పాటు నిద్ర‌పోయారు. అందుకు ఓ కార‌ణం ఉంది.

గుంటూరు జిల్లాలో విద్యుత్ బ‌కాయిలు రాబ‌ట్టేందుకు అధికారులు ప్ర‌జ‌ల‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇప్ప‌టికే అధికారుల తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బిల్లులు పెండింగ్‌లో ఉంటే విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తున్నారు. ఎవ‌రైనా స‌కాలంలో విద్యుత్ బిల్లు చెల్లించ‌క‌పోతే స‌ర‌ఫ‌రా నిలిపివేయ‌డం సాధార‌ణ విష‌య‌మే. కానీ ఏదైనా కాల‌నీలో పెద్ద సంఖ్య‌లో బిల్లులు పెండింగ్‌లో ఉంటే మొత్తం ఆ కాల‌నీకే విద్యుత్ నిలిపివేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఇలాగే వినుకొండ నియోజ‌క‌వ‌ర్గం ఈపూరు మండ‌లం ఎస్సీ కాల‌నీలో పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఎన్ని సార్లు చెప్పినా స్థానికులు చెల్లించ‌క‌పోవ‌డంతో అధికారులు క‌రెంట్ నిలిపివేశారు. గ‌త మూడు రోజులుగా ఈ కాల‌నీలో అంధ‌కారం అలుముకుంది. దీంతో స్థానికుల‌కు మ‌ద్దతుగా జీవీ ఆంజ‌నేయులు రంగంలోకి దిగారు.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తెచ్చేందుకు ఆ కాల‌నీలోనే స్థానికుల‌తో క‌లిసి రాత్రిపూట నిద్ర‌కు ఉప‌క్ర‌మించారు. ఆరుబ‌య‌ట ఓ టెంటు కింద ఆయ‌న నిద్ర సాగింది. దీంతో ఈ విష‌యం వైర‌ల్‌గా మారింది. ఈ కాల‌నీకి విద్యుత్ పున‌రుద్ధ‌రించేంత వ‌ర‌కూ ప్రభుత్వంపై ఈ పోరాటం కొన‌సాగుతుంద‌ని జీవీ స్ప‌ష్టం చేస్తున్నారు. ఆయ‌న ఆందోళ‌న‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. జీవీ ఆరోప‌ణ‌ల‌పై వైసీపీ నేత‌లు కౌంట‌ర్ ఇస్తున్నారు. టీడీపీ ప్ర‌భుత్వంలో విద్యుత్ ఉద్యమం చేసిన వాళ్ల‌పై కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న మ‌ర్చిపోయారా అంటూ అధికార పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి ఈ విద్యుత్ స‌మ‌స్య ఇప్పుడు అక్క‌డ నేత‌ల మ‌ధ్య మంట పుట్టించింది.