Begin typing your search above and press return to search.

టీడీపీ ప‌రువు ఏపాటిదో..క‌విత చెప్పేశారుగా!

By:  Tupaki Desk   |   23 Aug 2017 4:32 AM GMT
టీడీపీ ప‌రువు ఏపాటిదో..క‌విత చెప్పేశారుగా!
X
స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒక‌ప్పుడు తెలుగు ప్ర‌జ‌ల గుండెచ‌ప్పుడుగా ఉండేది. ఢిల్లీ వీధుల్లో అప్ప‌టిదాకా తీవ్ర అవ‌మానాలు ఎదుర్కొన్న తెలుగు... ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీతో స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని నిలిచింది. ఎవ‌రు కాద‌న్నా... ఎవ‌రు ఔన‌న్నా... ఈ మాట అక్ష‌ర స‌త్య‌మేనని ప్ర‌తి తెలుగు వాడూ చెబుతాడు. కేవలం ఢిల్లీలో తెలుగు ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న అవ‌మాన‌క‌ర ప‌రిణామాల‌ను చూసిన త‌ర్వాతే ఎన్టీఆర్ రాజ‌కీయ పార్టీ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ క్ర‌మంలోనే పార్టీ ఆవిర్భావం - ఆ వెంట‌నే ఆ పార్టీకి అధికారం ద‌క్క‌డం జ‌రిగిపోయాయి.

అయితే టీడీపీ ఆవిర్భావానికి కాస్తంత ముందుగా రాజ‌కీయ తెరంగేట్రం చేసిన నారా చంద్ర‌బాబునాయుడు... 1983లో వీచిన టీడీపీ ప్ర‌భంజ‌నంలో కొట్టుకుపోయారు. అయితే ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌ కు అల్లుడిగా మారిన చంద్ర‌బాబు... త‌న‌కు ఓట‌మి చ‌విచూపించిన టీడీపీలోనే చేరిపోయారు. ఇక ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచి ఆయ‌న చేతిలోని అధికారాన్ని కూడా లాగేసుకున్నారు. అయినా ఈ సోంది అంతా ఎందుకంటారా? ... ఎందుకేమిటీ నాడు ఎన్టీఆర్ కాలం నుంచి కూడా పార్టీ కార్య‌క‌లాపాల్లో ప్ర‌త్య‌క్షంగా పాలుపంచుకుంటూనే... ఇప్పుడు పార్టీలోనే తీవ్ర అవ‌మానాల‌కు గురవుతున్న నేత‌లు కొంత‌మంది ఇప్పుడు త‌మ గ‌ళాన్ని విప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. బాబు వ్య‌వ‌హార స‌ర‌ళిని జీర్ణించుకోలేక చాలా మంది పార్టీ నేత‌లు ఇప్ప‌టికే ఆ పార్టీకి దూర‌మయ్యారు. ఇప్పుడు మ‌రో కీల‌క నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... పార్టీలో చాలా కాలం నుంచి క్రియాశీల స‌భ్యురాలిగా కొన‌సాగుతున్న ప్ర‌ముఖ సినీ న‌టి క‌విత‌... మొన్నామ‌ధ్య పార్టీ మ‌హానాడు వేదిక‌గా క‌న్నీళ్లు పెట్టుకున్న విష‌యం గుర్తుందిగా. నాడు మ‌హానాడు వేదిక‌లో త‌న‌ను అవ‌మానించార‌ని, వేదిక ఎదుటే క‌న్నీళ్లు పెట్టుకున్న ఆమె... ఆర్య‌వైశ్య మ‌హిళ‌ల ఉసురు చంద్ర‌బాబుకు త‌గ‌ల‌క త‌ప్ప‌ద‌ని శాప‌నార్థాలు పెట్టి మ‌రీ వెళ్లిపోయారు. అయితే ఆమెను అనున‌యించ‌డం, జ‌రిగిన త‌ప్పిదాన్ని స‌రిదిద్దుకునే య‌త్నాలేవీ చంద్రబాబు నుంచి క‌నిపించ‌ని నేప‌థ్యంలో తీవ్ర ఆవేద‌నలో కూరుకుపోయిన క‌విత‌.. ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే నిన్న ఆమె త‌న స‌న్నిహితుల‌తో నిర్వ‌హించిన భేటీలో చంద్ర‌బాబు వ్య‌వ‌హార స‌ర‌ళిపై నిప్పులు చెరిగార‌ట‌.

పార్టీలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారికి గుర్తింపు ఉండ‌టం లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌. అయినా నాడు ఎన్టీఆర్ ఉండ‌గా పార్టీ వ్య‌వ‌హార స‌ర‌ళి - ఇప్పుడు చంద్ర‌బాబు వ్య‌వ‌హార స‌ర‌ళికి అస్సలు పోలికే లేద‌ని కూడా ఆమె వ్యాఖ్యానించార‌ట‌. గ‌తంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాన‌ని హామీ ఇచ్చిన చంద్రబాబు... ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాన‌ని మాట మార్చార‌ని, ఆ హామీ కూడా నీటి మూటేన‌ని తేలిపోయింద‌ని చెప్పుకొచ్చార‌ట‌. ఈ క్ర‌మంలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారికి గుర్తింపు లేని పార్టీలో ఎన్నాళ్లు ఉండాల‌ని ప్ర‌శ్నించిన ఆమె... త్వ‌ర‌లోనే ఆ పార్టీకి రాజీనామా చేయాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.