Begin typing your search above and press return to search.

ఆమెకు బయట చాలా డిమాండుందట!

By:  Tupaki Desk   |   30 Oct 2017 4:01 AM GMT
ఆమెకు బయట చాలా డిమాండుందట!
X
రాజకీయ పార్టీలకు రాజీనామాలు చేసేవారు.. ముందుగా మరో పార్టీలో తమకు అవకాశం ఉన్నదో లేదో జాగ్రత్తగా చెక్ చేసుకుని ఆ తర్వాతే పావులు కదుపుతారు. ఒకసారి రాజకీయం అలవాటు అయిన తర్వాత.. ప్రాభవం లేకుండా బతకడం వారికి నరకప్రాయంగా ఉంటుంది. ఇలా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మరో దెబ్బ పడుతోంది. తెలంగాణలో కాదు. పార్టీ అధికారంలో ఉన్న ఏపీలోనే పార్టీ లోని సీనియర్లలో ఒకరు - సినీ నటి అయిన కవిత రాజీనామా చేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే తెలుగుదేశాన్ని వీడి ఎటువైపు అడుగులు వేయాలో ఇంకా నిశ్చయించుకోకుండానే ఆమె రాజీనామాకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

సినీ నటి కవిత చాలా కాలం కిందట తెలుగుదేశంలో చేరారు. మాజీ హీరోయిన్ గా తనను అక్కడ అందలం ఎక్కిస్తారని ఆమె భావించారు. కానీ అసలే తెలుగుదేశంలో సినీ జీవులు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆమెకు అందలాలు గానీ, అవకాశాలు గానీ దక్కలేదు. గత కొన్నాళ్లుగా ఆమె పార్టీ తనను చిన్న చూపు చూస్తున్నదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనను సెలబ్రిటీగా పార్టీ గుర్తించడం లేదు అనేది ఆమె ప్రధాన ఆవేదన. అయితే చంద్రబాబునాయుడు ఎంతటి వారినైనా సరే చిన్న చూపు చూడగలడు అనేది ఆమెకు అర్థమైనట్లు లేదు అని పలువురు కామెంట్లు విసురుతుండడం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లోనే తెలుగుదేశానికి రాజీనామా చేయబోతున్నట్లుగా కవిత ప్రకటించడం చిన్నపాటి సంచలన విషయమే. సాధారణంగా నాయకులు తమను పార్టీ చిన్నచూపు చూసినా.. అధికారంలో ఉన్న పార్టీ అయితే గనుక.. ఒక పట్టాన వీడిపోరు. ప్రాధాన్యం తర్వాత.. ఏదో చిన్న చిన్న ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి చూస్తూ ఉంటారు. ఒకవైపు రాష్ట్రంలో అందరూ అధికార పార్టీ పంచకు చేరడానికి చూస్తోంటే.. సీనియర్ అయిన కవిత.. అధికార పార్టీనే వీడిపోవడం అనేది.. తెలుగుదేశం పట్ల శ్రేణుల్లో ప్రబలుతున్న అంసతృప్తికి సంకేతం అని పలువురు భావిస్తున్నారు.