Begin typing your search above and press return to search.

అక్క‌డ పోటీ చేసే ద‌మ్ముందా.. మంత్రికి కోడెల త‌న‌యుడి స‌వాల్

By:  Tupaki Desk   |   7 Aug 2022 5:30 AM GMT
అక్క‌డ పోటీ చేసే ద‌మ్ముందా.. మంత్రికి కోడెల త‌న‌యుడి స‌వాల్
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న‌యుడు కోడెల శివ‌రామ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను స‌త్తెన‌ప‌ల్లి నుంచే బ‌రిలోకి దిగుతాన‌ని స్ప‌ష్టం చేశారు. ఓడినా, గెలిచినా తాను సత్తెన‌ప‌ల్లిలోనే ఉంటాన‌ని తెలిపారు. ఓడిపోతే మంత్రి అంబ‌టి రాంబాబు స‌త్తెన‌ప‌ల్లిలో ఉంటారా అని నిల‌దీశారు. అస‌లు స‌త్తెన‌ప‌ల్లిలో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించే ద‌మ్ము అంబ‌టికి ఉందా అని స‌వాల్ విసిరారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల‌లో త‌న‌పై ఎన్నో కేసులు పెట్టి ర‌క‌ర‌కాలుగా ఇబ్బందులు పెట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాలు పోసిన వాళ్లే పాముల్లా కాటేస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాట‌న్నింటికి స‌మాధానం వచ్చే ఎన్నిక‌ల్లో గెలిచాక చెబుతాన‌ని హెచ్చ‌రించారు.

కాగా 2014లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేసిన కోడెల శివ‌ప్ర‌సాద‌రావు అతి త‌క్కువగా 924 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అంబ‌టి రాంబాబుపై గెలుపొందారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో శాస‌న‌స‌భ స్పీక‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక 2019లో అంబ‌టి రాంబాబు.. కోడెలపై 20 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్ లో అంబ‌టి రాంబాబు జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా ఉన్నారు. కాగా ఎన్నిక‌ల్లో ఓడిన కొద్ది కాలానికే కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.
కాగా గ‌తంలో కోడెల శివ‌ప్ర‌సాద‌రావు న‌ర‌స‌రావుపేట నుంచి 1983 నుంచి 1999 వ‌ర‌కు వ‌రుస‌గా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మ‌రోవైపు కోడెల కుమార్తె, కుమారుడిపై ప‌లువురు ఆరోప‌ణ‌లు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ‌ను బెదిరించి డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని, కోడెల ట్యాక్స్ పేరుతో చిన్న చిన్న బ‌డ్డీ కొట్ల నుంచి పెద్ద కార్ల షోరూముల వ‌ర‌కు మామూళ్లు వ‌సూలు చేశార‌ని ఫిర్యాదులు చేశారు. ఈ వ్య‌వ‌హారంలో కోడెల శివ‌రామ్ కొద్ది రోజులు జైలుకు కూడా వెళ్లారు. తాజాగా ఈ ఏడాది జూలై 20న ఆయ‌న‌పై గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇద్ద‌రు కోర్టులో కేసు వేశారు.

కోడెల శివరాంకు చెందిన ఇన్ ఫ్రా కంపెనీలో 2016లో తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన యలవర్తి సునీత రూ.26,25,000, పాలడుగు బాల వెంకట సురేష్ రూ.24,25,000 పెట్టుబడి పెట్టారు. అయితే ఐదేళ్లు గ‌డిచినా త‌మ పెట్టుబ‌డికి సంబంధించిన లాభం ఇవ్వ‌డం లేద‌ని తెనాలి కోర్టులో కేసు వేశారు. దీంతో కోడెల శివ‌రామ్ పై చీటింగ్ కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు పోలీసుల‌ను ఆదేశించింది.