Begin typing your search above and press return to search.

మందు బాబులకు తెలుగుదేశం ఫుల్ సపోర్ట్!

By:  Tupaki Desk   |   3 Oct 2019 4:21 PM GMT
మందు బాబులకు తెలుగుదేశం ఫుల్ సపోర్ట్!
X
తమకు అధికారం ఇస్తే మద్యం ధరలను భారీగా పెంచుతామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతూనే వచ్చారు. తన పాదయాత్ర ప్రసంగాల్లో ఆయన ఈ విషయాన్ని పదే పదే చెప్పారు కూడా. తమకు అధికారం ఇస్తే మద్యం ధరలను షాక్ కొట్టేంత స్థాయికి పెంచేస్తామని జగన్ ఒకటికి వెయ్యి సార్లు చెప్పారు. మద్యపానాన్ని కట్టడి చేయడమే తమ ఉద్దేశమని జగన్ స్పష్టం చేశారు.

అందులో భాగంగా అధికారం అందిన తర్వాత కొత్త మద్యపాన విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆ మేరకు మద్యం దుకాణాల నంబర్ ను కూడా భారీగా తగ్గించి వేశారు. దాదాపు ఇరవై శాతం దుకాణాలను రద్దు చేశారు. అలాగే మద్యాన్ని ప్రభుత్వమే నియంత్రిస్తూ, అమ్మే పద్ధతిని అవలంభిస్తూ ఉన్నారు.

ఇదేమీ కొత్తది కాదు. గతంలో కూడా మద్యపాన నియంత్రణకు ప్రభుత్వమే అమ్మే బాధ్యతలు తీసుకున్న సందర్భాలున్నాయి. అయితే ఈ విధానాలన్నింటినీ తెలుగుదేశం తప్పుపడుతూ ఉంది. మద్యం ధరల పెంపును తెలుగుదేశం తప్పు పట్టింది. మద్యం ధరలను భారీగా పెంచడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తూ ఉంది.

మద్యం ధరలను తగ్గించాలని టీడీపీ నేత కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. మద్యం ధరలను అందుబాటులోకి తీసుకురావాలన్నట్టుగా ఆయన డిమాండ్ చేసేశారు. అలాగే ప్రభుత్వం మద్యం అమ్మకాలను నియంత్రించడాన్ని కూడా తప్పుపట్టారు. ప్రభుత్వం మద్యం అమ్మడమేమిటని ప్రశ్నించారు.

అయితే గతంలో తెలుగుదేశం హయాంలోనూ పోలీసుల చేత సారాయి అమ్మించిన నేపథ్యం ఉంది. అవన్నీ మరిచిపోయినట్టుగా టీడీపీ వాళ్లు ఇప్పుడు మాట్లాడుతూ ఉండటం గమనార్హం అని పరిశీలకులు పేర్కొంటున్నారు.