Begin typing your search above and press return to search.

ఈ నేలబారుడు రాజకీయాలేంది బాబూ...?

By:  Tupaki Desk   |   23 April 2022 9:06 AM GMT
ఈ నేలబారుడు రాజకీయాలేంది బాబూ...?
X
చంద్రబాబు జాతీయ నాయకుడు. ఈ విషయంలో నో డౌట్. ఆయన యునైటెడ్ ఫ్రంట్ టైమ్ లోనే ఢిల్లీలో చక్రం తిప్పారు. అలాగే వాజ్ పేయ్ ప్రధాని కావడానికి టీడీపీ ఎంపీల మద్దతు కూడా కీలకం. అలా ఎన్డీఏకు ఆక్సిజన్ ఇచ్చిన నేతగా మరోమారు బాబు ఢిల్లీ రాజకీయాలలో మారు మోగారు. ఇక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఆయన పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగుతున్నారు.

మరి ఇంతటి విశేష అనుభవం ఉన్న బాబు దార్శనీకుడుగా ఉండాలి. మరీ ముఖ్యంగా టీడీపీ శ్రేణులకు సరైన దిశా నిర్దేశం చేసే విధంగా ఉండాలి. చిత్రమేంటి అంటే బాబుకు అన్నీ తెలుసు. కానీ ఆయన ఆచరణలోనే కొంత ఆరాటం, ఆతృత కనిపిస్తున్నాయి. దానికి ఉదాహరణ విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగ యువతి మీద జరిగిన అత్యాచారం ఘటనలో అతి ఉత్సాహం.

నిజానికి ఇది దారుణాతిదారుణం. హేయమైన విషయం. మనిషి అన్న ప్రతీవాడూ సిగ్గుపడే విషయం. అలాంటి ఘటనను అంతా ఖండించాలి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కూడా దీనిని ఖండించాలి. ఆయన ఆ పని ముందే చేశారు. అంతటితో ఆగకుండా ఆసుపత్రికి పరామర్శకు వెళ్ళారు.

పోనీ పరామర్శించి వచ్చేశారా అంటే అక్కడ ఎదురుపడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మని అక్కడే నిలదీశారు. ఆమెతో వాగ్వాదం పెట్టుకున్నారు. నిజంగా చంద్రబాబు స్టేచర్ ఏంటి, ఆయన చేయాల్సింది ఏంటి. వాసిరెడ్డి పద్మ సీనియర్ లీడరే. ఆమె వంతు ఆమె పరామర్శకు వచ్చారు. ఆమెకు ఎదురువెళ్లి మహిళల మీద దాడులకు ఏంచేస్తున్నారు అని నిగ్గదీస్తే ఆమె ఏం చెబుతారు.

అయినా దాన్ని అడిగేవారు కడిగేసేవారు వేరేగా ఉంటారు. చంద్రబాబు లాంటి నాయకుడికి అది అవసరమా అన్న చర్చ వస్తోంది. ఆయన వరకూ చూస్తే పరామర్శకు ద్వితీయ శ్రేణి నాయకులను పంపించేసి తాను మహిళల మీద దాడుల మీద మీడియాలో గట్టిగానే మాట్లాడవచ్చు.

అలాంటిది బాబు తన స్థాయిని మరచి మరీ ఆసుపత్రి వద్దకు వెళ్ళి వాసిరెడ్డి పద్మతో గొడవ పెట్టుకోవడం, ఆ మీదట ఆమె చైర్ పర్సన్ హోదాలో తన ముందు హాజరు కావాలని బాబుకు నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. అసలు ఇవన్నీ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ బాబుకు అవసరమా అన్న చర్చ అయితే ఉంది.

బాబు రేపటి ఏపీని ఎలా రూపుదిద్దాలో తన దార్శనికతతో జనాలను చైతన్యం చేయవచ్చు. తన మార్క్ పాలిటిక్స్ తో వారి మెప్పు పొందవచ్చు. తెల్లారి లేస్తే జరిగే ఇలాంటి అఘాయిత్యాల మీద పరామర్శలు, విమర్శలు వంటి వాటికి పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎటూ సిద్ధంగా ఉంటుంది.

కానీ బాబు ప్రతీ దానికీ అన్నీ తానే అని వెళ్లడంతో ఆయన నేలబారుడు రాజకీయాలు చేస్తున్నారా అన్న భావన అయితే వస్తోంది. తన ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని బాబు విధాన కర్తగా ఉండాలి తప్ప వివాదాలకు కేంద్ర బిందువు కారాదు. అది జూనియర్స్ పాలిటిక్స్ లో చేసే పని. మరి బాబు ఈ సత్యం తెలుసుకుంటే మరింతగా త‌టస్థులు. మేధావుల మద్దతు పొందుతారేమో.