Begin typing your search above and press return to search.

ఇవేమి సరదాలు చినబాబూ...ఆ ట్యాగ్ కోసమేనా...?

By:  Tupaki Desk   |   19 April 2022 11:30 AM GMT
ఇవేమి సరదాలు చినబాబూ...ఆ ట్యాగ్ కోసమేనా...?
X
చినబాబు అంటే లోకేష్ బాబే. ఆయన ఎప్పటికీ చినబాబే. ఎందుకంటే అధినాయకుడు చంద్రబాబు పెద్దగా ఉండగా ఈయన చినబాబు కాక మరేమవుతారు. సో అదీ లెక్క అన్న మాట. ఇక తెలుగుదేశం పార్టీ భావి వారసుడి హోదాలో లోకేష్ సమయం సందర్భం వచ్చినపుడల్లా బిగ్ సౌండ్ చేస్తూ ఉంటారు. ఆయనకు ఎందుకో జైలుకు వెళ్ళాలని కోరిక ఉన్నట్లుగా ఉంది. లేకపోతే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, జైల్లో వేసుకోండి అని చాలా ఈజీగా సవాళ్లు విసురుతారు.

అంటే జైలుకి వెళ్తే ఆ కధే వేరుగా ఉంటుంది. కొత్త ఇమేజ్ వస్తుంది. రాజకీయ నాయకులు ముదిరారు అంటే జైలును చూసి వచ్చిన వారే అన్న లెక్క కూడా ఉంది. దాంతో ఎక్కడో ఫారిన్ లో పెద్ద చదువులు చదివి క్లాస్ గా ఉన్నాను, అలాగే ఉంటాను అనుకోమాకండి, నేను పక్కా మాస్. నాలోని మాస్ అప్పీల్ చాలా ఉంది అంటూ చినబాబు ఎప్పటికపుడు చెబుతూ ఉంటారన్న మాట.

ఇక చినబాబు మాస్ లుక్ కోసం గడ్డం పెంచేశారు, రగ్డ్ ఫేస్ కోసం బాగా మేకోవర్ అవుతున్నారు. ఇక మాటలోనూ మాసిజం ఉండాలని చాలా కాలంగా పట్టుదలగా అదే పని మీద ఉన్నారు. ఈ మధ్యనే ఆయన మాట్లాడుతూ తనను ఒక మూర్ఖుడిగా కూడా చెప్పేసుకున్నారు. నేను మా నాన్న చంద్రబాబు అంత సాఫ్ట్ కాదు, మాస్ అంటే మాసే అని కూడా గర్జించారు.

ఇక లేటెస్ట్ గా చినబాబు డిమాండ్ ఏంటి అంటే రౌడీ షీటర్ ని తన మీద ఓపెన్ చేయమని. ఆయన నేరుగా జగన్ కి సవాల్ చేస్తున్నారు. నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్కోండి, నేనేమీ భయపడను అని బిగ్ ఆఫర్ ఇచ్చేశారు. తన మీద ఇప్పటికే పన్నెండు కేసులు పెట్టారని, వేటికీ తాను భయపడేది లేదని కూడా చినబాబు చెబుతున్నారు.

అయితే చినబాబు పన్నెండు కేసులు అని చెబుతున్నా వాటిలో ఏ ఒక్కటీ జనాలకు గుర్తుండడం లేదు, దాని తాలూకా ఇంపాక్ట్ కూడా ఏమీ కనిపించడంలేదు. పొలిటికల్ గా మైలేజీ లేదు. అయినా సరే పదే పదే తన మీద కేసులు పెట్టారూ అని చినబాబు చెప్పుకుంటున్నారు.

మరి చినబాబు మాటకు వస్తే అరెస్ట్ చేయమంటున్నారు, జైలులో పెట్టమంటున్నారు, కేసులు పెట్టుకోమంటున్నారు. తన మీద తానె నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. తాను తండ్రి చంద్రబాబులా మంచి వాడిని కాదు, మహా చెడ్డ అని కూడా కుండబద్ధలు కొడుతున్నా జనాల్లో మాత్రం ఆయన ఇప్పటికైతే ఇంకా చినబాబే. తండ్రి చాటు బిడ్డడే.

మరి జగన్ జైలుకు వెళ్లాకనే ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయన పక్కా మాస్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లోనూ మాస్ ఇమేజ్ ఉంటేనే కధ వేరుగా ఉంటుంది. ఆ విషయం కాస్తా ఆలస్యంగా తెలుసుకున్నా ఇపుడు చినబాబు ఆ ట్యాగ్ కావాలని ఆరాటపడుతున్నారు. ఇక ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చి మూడేళ్ళు అయింది.

టీడీపీలో ఉన్న కీలక నాయకులను వరసబెట్టి మరీ అరెస్ట్ చేశారు కానీ లోకేష్ ని అరెస్ట్ చేయలేదు. చేస్తే ఏమవుతుందో వారికి తెలుసు. అందుకే చినబాబు అరెస్ట్ అంటున్నారు. మరో రెండేళ్లు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ లోగా చినబాబు అరెస్ట్ అవుతారా. ఆయన కోరుకున్నట్లుగా కేసులు మరో డజన్ దాకా అయినా పెడతారా, రౌడీ షీట్ ని ఓపేన్ చేస్తారా.

ఏమో తెలియదు కానీ ఇక్కడ రాజకీయ లెక్కలు చాలా ముఖ్యం. కోరి చినబాబుని అరెస్ట్ చేసి ఆయన ఇమేజ్ ని అమాంతం పెంచేయడానికి వైసీపీ పెద్దలు ఏమైనా అమాయకులా. అంటే చినబాబు కోరిక అయితే అలా తీరదు, మరి ఏం చేయాలి. మాస్ ఇమేజ్ కోసం చినబాబే వేరే రూట్లో రావాల్సిందే. అయితే అది లాంగ్ టెర్మ్ ప్రాసెస్. రెండేళ్లలో అయ్యే పని అయితే కాదు. మొత్తానికి చినబాబు సరదాలు అలా పరదాల చాటున ఉండిపోవాల్సిందేనా. ఇప్పటికైతే ఇంతే మరి.