Begin typing your search above and press return to search.

ఆఫీసుకు కాదు గెస్ట్ హౌసుకు ర‌మ్మంటున్నారు: టీడీపీ మాజీ మ‌హిళా నేత హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   13 July 2022 3:30 AM GMT
ఆఫీసుకు కాదు గెస్ట్ హౌసుకు ర‌మ్మంటున్నారు: టీడీపీ మాజీ మ‌హిళా నేత హాట్ కామెంట్స్
X
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ అనుబంధ విభాగం ఐటీడీపీ ద్వారా సోషల్‌ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టించి హింసిస్తున్నార‌ని టీడీపీ మాజీ మహిళా నేత పాలేటి కృష్ణవేణి సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా నారా లోకేష్ పీఏ సాంబ‌శివ‌రావు టీడీపీలో ఉన్న మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నాడ‌ని ఆమె ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీసుకు కాకుండా గెస్ట్ హౌసుకు ర‌మ్మంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ మ‌హిళా నేత‌గా ఉన్న పాలేటి కృష్ణ‌వేణిని కొన్ని నెల‌ల క్రితం టీడీపీ నుంచి స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో జూన్ 2న ఆమె నారా లోకేష్ తోపాటు టీడీపీ ఐటీ టీమ్ పై మంగ‌ళ‌గిరి రూర‌ల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఒక ప్ర‌ముఖ యూట్యాబ్ చాన‌ల్ కు పాలేటి కృష్ణ‌వేణి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీలో మహిళ‌లు ఇమ‌డ‌లేర‌ని.. సాధినేని యామిని, దివ్య‌వాణి అందుకే బ‌య‌ట‌కొచ్చార‌ని గుర్తు చేశారు. ఒకే భ‌ర్త‌తో ఉండాల‌నుకునే మ‌హిళ‌లు టీడీపీకి న‌చ్చ‌ర‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భ‌ర్త‌నే దైవంగా భావిస్తూ.. నిజాయితీగా పార్టీలో ప‌నిచేసేవారిని ఉంచ‌ర‌ని అన్నారు. వారి ప‌క్క‌ల్లో న‌లిగిపోయేవారే టీడీపీకి కావాల‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

త‌న‌ను టీడీపీ నుంచి స‌స్పెండ్ చేసే అధికారం నారా లోకేష్ కు ఎక్క‌డ ఉంద‌ని నిల‌దీశారు. లోకేష్ ఎన్టీఆర్ వార‌సుడు అనుకుంటే నారా అని కాకుండా నంద‌మూరి అని ఇంటి పేరు పెట్టుకోవాల‌న్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతి కోసం, తెలుగువారి కోసం పార్టీ పెట్టార‌ని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీలో తుమ్మ జాతి మాత్ర‌మే బాగుప‌డుతోంద‌ని చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పార్టీ లేదు, బొక్కా లేద‌ని అందుకే అన్నార‌న్నారు.

తన పేరుతో ట్విట్టర్‌ పోస్టును మార్ఫింగ్‌ చేసి.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. మహిళలు టీడీపీలో ఉన్నంతకాలం లోకేష్‌కు దేవతల్లా కనిపిస్తారని.. అక్కడి నుంచి బయటకు రాగానే బజారు మనుషుల్లా కనిపిస్తారన్నారు. త‌న త‌ల్లి గురించి వైఎస్సార్సీపీ నేతలు ఏదో అన్నార‌ని.. లోకేష్ తెగ బాధ‌ప‌డిపోయార‌ని, మ‌రి పార్టీలో ఉన్న మ‌హిళ‌ల ప‌ట్ల లోకేష్ కు శ్ర‌ద్ధ ఏద‌ని నిల‌దీశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మహిళల విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే.. ఇక అధికారంలోకి వస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏ పార్టీ కోసం, ఏ నాయకుడి కోసమైతే పని చేశానో అదే నాయకుడు నేడు తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. లోకేష్‌కు దమ్ముంటే మంగళగిరి నియోజకవర్గంలో గెలవాలని సవాల్‌ విసిరారు.

టీడీపీ కార్యాల‌యంలో లోకేష్ కు భ‌జ‌న చేసే వాళ్లే ఉన్నార‌ని పాలేటి కృష్ణ‌వేణి ఆరోపించారు. ఎస్సీ, బీసీల‌కు సుస్థిర స్థానం క‌ల్పించే పార్టీ టీడీపీ కాద‌ని ఆ ఇంట‌ర్వ్యూలో పాలేటి కృష్ణ‌వేణి ఘాటు వ్యాఖ్య‌లే చేశారు.