Begin typing your search above and press return to search.

ఏపీలో దారుణం.. టీడీపీ నేతపై హత్యాయత్నం!

By:  Tupaki Desk   |   17 Nov 2022 10:30 AM GMT
ఏపీలో దారుణం.. టీడీపీ నేతపై హత్యాయత్నం!
X
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపింది. టీడీపీ నేత పి.శేషగిరిరావు గతంలో మండల పరిషత్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

గురువారం తెల్లవారుజామున ఆయన ఇంటి వద్ద ఉండగా భవానీ భక్తుడి రూపంలో ఓ వ్యక్తి వచ్చి భిక్ష వేయాలని కోరాడు. దీంతో శేషగిరిరావు బయటకు వచ్చి ఆయనకు భిక్ష వేసే క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా దుండగుడు కత్తితో శేషగిరిరావు తల నరకడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన వేగంగా తల వెనక్కి జరిపి కిందకు పడిపోయారు.

దీంతో దుండగుడు తన చేతిలో ఉన్న కత్తితో ఆయనను మరోమారు నరకడానికి ప్రయత్నించడంతో శేషగిరిరావు చేతులు అడ్డం పెట్టారు. దీంతో దుండగుడు తన చేతిలో ఉన్న కత్తితో ఆయన చేతిపై, ఆ తర్వాత తలపై నరికి పరారయ్యాడు. ఈ శబ్దానికి ఇంట్లో ఉన్న శేషగిరిరావు భార్య బయటకు వచ్చే దుండగుడు పారిపోయాడు.

కత్తి దాడిలో గాయపడ్డ శేషగిరిరావును ఆస్పత్రికి తరలించారు. కాగా దుండగుడు కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి. టీడీపీ నేత నేలపై కుప్పకూలిపోయే వరకు దుండగుడు కత్తితో దాడి చేస్తూనే ఉన్నాడు. శేషగిరిరావు కేకలు విని కుటుంబ సభ్యులు బయటకు రాగా అప్పటికే దుండగుడు మోటర్‌బైక్‌పై పరారయ్యాడు

కాగా శేషగిరిరావును తునిలో ఒక ఆస్పత్రిలో చేర్చారు. టీడీపీ నేతలు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప ఆస్పత్రిని సందర్శించి బాధితుడిని పరామర్శించారు.

మరోవైపు శేషగిరిరావుపై దాడి చేసింది రోడ్లు, భవనాల మంత్రి దాడిశెట్టి రాజా మద్దతుదారులేనని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ హత్యాయత్నాన్ని టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లోనే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నడుస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అణచివేత, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే శేషగిరిరావుపై దాడి జరిగిందని ధ్వజమెత్తారు. హత్యాయత్నానికి పాల్పడిన వారందరినీ, దాని వెనుక ఉన్న వారిని శిక్షించే వరకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.