Begin typing your search above and press return to search.

పులివెందుల్లో తేల్చుకుందామా జ‌గ‌న్‌?

By:  Tupaki Desk   |   7 Jun 2016 11:06 AM GMT
పులివెందుల్లో తేల్చుకుందామా జ‌గ‌న్‌?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాసనమండలి ఉపాధ్యక్షుడు - తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత ఎస్వీ సతీష్‌ రెడ్డి ఏపీ ప్రతిపక్షనేత వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డికి ఘాటు స‌వాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించిన స‌తీష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 'సీఎం చంద్ర‌బాబు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అనంతపురం జిల్లాలో మాట్లాడడం కాదు. సొంత నియోజకవర్గమైన పులివెందులలో ప్రభుత్వ పథకాల అమలు గురించి మాట్లాడుకుందాం’ అని స‌వాల్ విసిరారు. రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అడ్డంగా విభజించారని, ఈ క్ర‌మంలో ఏపీ తీవ్ర అన్యాయానికి గురైందని స‌తీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబునాయుడుకే సాధ్యమని ఆయనను ప్ర‌జ‌లు గెలిపించారని చెప్పారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షనేత జగన్‌ ముఖ్యమంత్రిపై ఇష్టానుసారం మాట్లాడటం తగదని అన్నారు.

మ‌రోవైపు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సైతం జ‌గ‌న్ తీరుపై మండిప‌డ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విపక్షనేత జగన్‌ వ్యక్తిగత ధూషణలు చేయడం సరికాదని అన్నారు. జగన్‌ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని సీఎంకు క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత లోటుబడ్జెట్‌ లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ను చంద్ర‌బాబు తన పాలనానుభవంతో అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్నారని చెప్పారు. మిగులు బడ్జెట్‌ లో ఉన్న తెలంగాణా రాష్ట్రం రైతు రుణమాఫీ కింద రూ.లక్ష ఇస్తుంటే - లోటుబడ్జెట్‌ ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వం రూ.1.50 లక్షల రుణం మాఫీ చేయడం గొప్ప విషయమన్నారు. ఎన్నికల వేళ రైతురుణమాఫీ అసాధ్యమని జగన్‌ చెప్పిన మాటలను ఆది గుర్తుచేశారు. వైకాపా మునిగిపోయే పార్టీ అని ఆది వ్యాఖ్యానించారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోయారని అనడం సరికాదన్నారు. జగన్‌ వైఖరి నచ్చక.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఏడాదిన్నర కిందటే తన వైఖరి మార్చుకోవాలని జగన్‌ కు సూచించినట్లు ఆది చెప్పారు. జగన్‌ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయ‌న వ్యాఖ్యానించారు.