Begin typing your search above and press return to search.

మా ప్రాంతాన్ని మళ్లీ కర్ణాటక లో కలిపేయండి : టీడీపీ నేత

By:  Tupaki Desk   |   1 Jan 2020 6:34 AM GMT
మా ప్రాంతాన్ని మళ్లీ కర్ణాటక లో కలిపేయండి : టీడీపీ నేత
X
ప్రస్తుతం ఏపీ లో రాజధాని రచ్చ అగ్గి రాజేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంటే రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో ప్రకటించినప్పటి నుండి రాష్ట్రం లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ..రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ గత 15 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరికి టీడీపీ , జనసేన , బీజేపీ పార్టీలో కొందరు నేతలు మద్దతు తెలుపుతున్నారు. సీఎం జగన్ చెప్పినట్టు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల సీమ ప్రజలకి ఒరిగేది ఏమీలేదని, అలాగే రాజధానిని విశాఖకు మారిస్తే తమకు మరింత ప్రయాణభారమవుతుందని రాయలసీమవాసులు అంటున్నారు.

ఈ నేపథ్యం లో కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజక వర్గం టీడీపీ నేత తిక్కారెడ్డి మీడియా తో మాట్లాడుతూ ..కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల పేరు తో ప్రజలను ముఖ్యమంత్రి ఆయోమయానికి గురి చేస్తున్నారని , మూడు రాజధానులతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని సీఎం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకప్పుడు కర్నూలు పార్లమెంటు స్థానం కర్ణాటకలో ఉండడంతో భాషాపరంగా బళ్లారి జిల్లాలో ఉన్న ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ లో కలిపితే సహకరించామని , రాజధానిని విశాఖ పట్టణానికి తరలిస్తే రాయలసీమ ప్రజలు అక్కడ కు వెళ్లాలంటే 22 గంటల సమయం పడుతుందని, పూర్తి మెజారిటీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి ఇష్టారాజ్యం గా చేస్తున్నారని మండి పడ్డారు.

ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన చేతకాక రాజధాని పేరుతో ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో ఆర్డీఎస్‌ కుడి కాల్వ, వేదావతి టెండర్లను ప్రస్తుత ముఖ్యమంత్రి రద్దు చేశారని, రాష్ట్రం లో జగన్‌ మోనార్క్‌ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడక ముందు 1956లో తమ ప్రాంతం బళ్లారి జిల్లా ఆదోని తాలుకాలో ఉండేదని, దీనితో ఇపుడు మళ్లీ మా ప్రాంతాన్ని కర్నాటక లో కలిపేయాలని ఆయన డిమాండు చేశారు. తమ ప్రాంతంలో అంతా కర్ణాటక సంప్రదాయమే ఉందని తెలిపారు. దింతో తక్షణమే మా ప్రాంతాన్ని మళ్లీ కర్ణాటక లో కలపాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రాజధాని పేర్ల తో కర్నూలు, హైదరాబాద్‌, అమరావతి, ఇప్పుడు విశాఖపట్నం తెరపైకి తేవడం జీర్ణించుకో లేక పోతున్నామని అన్నారు. దీనికోసం అవసరమైతే , కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమాలు చేస్తామన్నారు.