Begin typing your search above and press return to search.

బాలయ్య చిన్నల్లుడు లెక్కల్లో మరీ ఇంత వీకా?

By:  Tupaki Desk   |   20 Oct 2019 5:03 AM GMT
బాలయ్య చిన్నల్లుడు లెక్కల్లో మరీ ఇంత వీకా?
X
మీకు ఒకరి నుంచి కోటి రూపాయిలు రావాలనుకుందాం. అలా రావాల్సిన డబ్బులు కారణాలు ఏమైనా రాలేదనుకుందాం. అందుకని బ్యాంకుకు చెల్లించాల్సిన రూ.10 కోట్లు చెల్లించకుండా పేపర్లో పేర్లు పడే పరిస్థితి వరకూ తెచ్చుకుంటారా? వ్యాపారంలో ఆటుపోట్లు సహజం. అలా అని ఇబ్బంది ఎదురైప్పుడల్లా బ్యాంకులకు హ్యాండ్ ఇవ్వటం బాధ్యతతో కూడుకున్న పనే అవుతుందా?

సరిగ్గా ఈ పోలికకు తగ్గట్లే ఉంది ప్రముఖ నటుడు బాలయ్య వారి చిన్నల్లుడి వ్యవహారం. మొన్నామధ్య ఏపీ అసెంబ్లీకి.. పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగటం తెలిసిందే. ఆ సందర్భంగా విశాఖపట్నం ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా భరత్ బరిలోకి దిగారు. ఎన్నికల్లో ఓడారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆంధ్రా బ్యాంకు ఇచ్చిన ఒక ప్రకటనలో ఆస్తుల వేలానికి సంబంధించిన యాడ్ ఒకటి పబ్లిష్ అయ్యింది. అందులో భరత్ కుటుంబానికి చెందిన కంపెనీ రూ.13 కోట్లు బకాయిలు పడినట్లుగా ఉంది.

ఇదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఒక ట్వీట్ చేస్తూ.. నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు - విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. @ncbn దొంగల ముఠా - ఆయన @BJP4India లోకి పంపిన వాళ్లు అంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారంటూ మండిపడ్డారు.

దీనిపై భరత్ రియాక్ట్ అయ్యారు. "విజయసాయి రెడ్డి గారు...ఇప్పుడు మీరు ప్రభుత్వంలో బాధ్యత గల పదవి లో ఉన్నారు. మీరు అంతే బాధ్యతగా మాట్లాడాలని ఆశిస్తాము. కానీ అందుకు భిన్నంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలకు నేను బదులు చెప్పాల్సి వస్తోంది. ర్మాష్ట ప్రభుత్వం నుండి మాకు రావలసిన బకాయిలు దాదాపు రూ. ౩ కోట్లు. ట్రాన్స్ కో గనుక మాకు సకాలంలో చెల్లింపులు చేసి ఉంటే బ్యాంకు రుణం సమయానికి చెల్లించే వాళ్ళం. ప్రభుత్వంలో ఉన్న మీరు, ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పరిస్టితి లో ఉన్న విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా, నేను ప్రజల డబ్బును దొంగిలించినట్లు నిందలు వేయడం చాలా విచారకరం’’ అంటూ వరుస పెట్టి ట్వీట్లు వేశారు.

ఔత్సాహిక పరిశ్రమలను ప్రోత్సహించండి కాని తనలాంటి వారిని అవమానపరిచేలా వ్యవహారించవద్దని విన్నవిస్తున్నట్లు లేఖ కూడా రాశారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. తన తప్పును ఎత్తి చూపిన వారిని మరో నింద వేయటం ద్వారా తన తప్పు ఏమీ లేదన్నట్లుగా భరత్ తీరు ఉందంటున్నారు. వ్యాపారం అన్నాక ఎత్తు పల్లాలు సహజం. అలా అని.. ఎదురుదెబ్బ తగిలినంతనే బ్యాంకు నుంచి తీసుకున్న అప్పును కట్టకుండా వదిలేయటమేనా?

భరత్ లెక్కలోకే వెళదాం. ఏపీ ట్రాన్స్ కో నుంచి ఆయనకు రావాల్సింది రూ.3కోట్లు. కానీ.. ఆంధ్రా బ్యాంకు అప్పు రూ.13 కోట్లు. రూ.3 కోట్లు రావాల్సిన దానికి రూ.13 కోట్ల అప్పును చెల్లించకుండా ఆపేయటం ఏమిటి? వందల కోట్ల అధిపతి అయి ఉండి కూడా బ్యాంకు దగ్గర తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించకుండా.. ప్రభుత్వం పైన నోటికి వచ్చినట్లు నిందలు వేయటం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అంతేకాదు.. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నారని చెప్పే భరత్ ఫైనాన్స్ పరంగా మరీ వీక్ అన్నట్లుగా వ్యవహరించటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. అందుకే అనేది.. ట్వీట్లు చేసే వేళ.. ముందు వెనుకా చూసుకోవాలని చెప్పేది.