Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల ప్ర‌లోభం...తొలిఅరెస్టు టీడీపీ నేత‌దే

By:  Tupaki Desk   |   18 Oct 2018 6:28 PM GMT
ఎన్నిక‌ల ప్ర‌లోభం...తొలిఅరెస్టు టీడీపీ నేత‌దే
X
తెలంగాణ ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసేందుకు టీడీపీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని...డ‌బ్బులు కుమ్మ‌రిస్తున్నార‌ని తెలంగాణ అప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ కొద్దికాలం క్రితం చేసిన కామెంట్లు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను త‌ర‌లించి మ‌రీ ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు తెర‌తీస్తున్నార‌ని కేసీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, ఈ అంశాలు నిజ‌మనేలా...తాజాగా ఓ టీడీపీ నేత భారీ మొత్తంతో అరెస్ట‌వ‌డం వివిధ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్న టీడీపీ నాయకుడు వల్లభనేని అనిల్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం, రూ.59 ల‌క్ష‌లు సీజ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హైదరాబాద్ నుంచి జగిత్యాలకు డబ్బు తరలిస్తుండగా అనిల్‌తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెప్పారు. అనిల్ నుంచి రూ. 59 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. నిందితుల నుంచి కారు, నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదును ఆదాయ పన్ను శాఖకు పోలీసులు అప్పగించారు. ఎన్నికల కోసమే నగదును జగిత్యాలకు తరలిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. డబ్బు రవాణాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డబ్బు తరలిస్తున్న కారు నెంబర్ - ఏపీ 09 సీఎఫ్ 1144 అని వెల్ల‌డించారు. కాగా, ఇంత భారీ మొత్తంలో న‌గ‌దుతో టీడీపీ నేత అరెస్ట‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది.