Begin typing your search above and press return to search.

టీడీపీ ఫైర్ బ్రాండ్ కి చెక్ పెడుతున్న వైసీపీ

By:  Tupaki Desk   |   8 Jan 2023 3:35 PM GMT
టీడీపీ ఫైర్ బ్రాండ్ కి చెక్ పెడుతున్న వైసీపీ
X
తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద అసెట్ గా తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన అనిత డేరింగ్ అండ్ డేషింగ్ గా మాట్లాడుతారు. ఒక విధంగా చెప్పాలీ అంటే అధికార వైసీపీని ఆమె తనదైన మాటలతో చెడుగుడు ఆడేస్తారు. ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్ర విమర్శలు చేయాలంటే అనిత ముందు ఉంటారు.

ఆమె దూకుడు అలా రేంజిలో ఉంటుంది. ఇక తెలుగుదేశం అధినాయకత్వం కూడా ఆమెను గట్టిగానే ప్రోత్సహిస్తోంది. ఆమెను ఏకంగా పొలిట్ బ్యూరో మెంబర్ ని కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో అనితకు పాయకరావుపేట టికెట్ కూడా ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు.

అనితకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రత్యర్ధి పార్టీల తరఫున సరైన మహిళా నేత నుంచి పోటీ అయితే ఇప్పటిదాకా లేదు. వైసీపీ అధినాయకత్వం ఆ లోటుని ఎట్టకేలకు గుర్తించినట్లుంది. అందుకే ఆమె ఎమ్మెల్సీగా ఉన్న అనకాపల్లి జిల్లాకు చెందిన వరుడు కళ్యాణిని తెచ్చి మరీ వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేసింది. ఈ పదవి నిజానికి కొత్తగా క్రియేట్ చేసినది. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ప్రకాశం జిల్లాకు చెందిన మహిళా నాయకురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ఉన్నారు.

ఆమెతో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కళ్యాణిని తీసుకున్నారు. ఆమె ఉత్తరాంధ్రా జిల్లాలలో మహిళా వాయిస్ ని బలంగా వినిపించడమే కాకుండా ఎప్పటికపుడు తెలుగు మహిళ ప్రెసిడెంట్ అనితకు కౌంటర్లు ఇస్తున్నారు. దాంతో ఆమెని జగన్ గుర్తించి ఈ కొత్త పదవిని అప్పగించారు. ఇక మీదట విశాఖ జిల్లా రాజకీయం కాస్తా అనిత వర్సెస్ కళ్యాణిగా మారనుంది అంటున్నారు. అలాగే ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్ళు ఢీ అంటే ఢీ అని తలపడతారు అని అంటున్నారు.

మరో వైపున కళ్యాణిని వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటుకు పోటీ పెట్టాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన వరుడు కళ్యాణి విద్యాధికురాలు. మంచి వక్తగా ఉన్నారు. పైగా ఆమె పక్కా లోకల్. దాంతో ఆ సామాజికవర్గం బలంగా ఉన్న నేపధ్యంలో ఆమెను తెచ్చి ఎంపీ క్యాండిడేట్ గా ఎంపిక చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంచనా కడుతున్నారు.

ఇక చూస్తే సిట్టింగ్ ఎంపీగా భీశెట్టి సత్యవతి ఉన్నారు. ఆమె గవర సామాజికవర్గానికి చెందిన నాయకురాలు. ఆమెను వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీకి దించుతారు అని అంటున్నారు. ఇలా వరుడు కళ్యాణికి వరసబెట్టి ప్రమోషన్లు అవకాశాలు ఇస్తోంది వైసీపీ అధినాయకత్వం. మరి కళ్యాణి తన దూకుడుని మరింత పెంచుతారా ఆమె అనితతో ఏ రకమైన తీరున పోరాటం చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.