Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు షాక్‌..టీడీపీకి కాపు నేత గుడ్ బై..!

By:  Tupaki Desk   |   29 Aug 2019 3:22 PM GMT
చంద్ర‌బాబుకు షాక్‌..టీడీపీకి కాపు నేత గుడ్ బై..!
X
ఏపీలో అధికార టీడీపీకి వ‌రుస షాకుల ప‌రంప‌ర‌లో భాగంగా మ‌రో షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు పార్టీని వీడి ఏదో ఒక పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇటు ఏపీ - అటు తెలంగాణ‌లో ప‌రిస్థితులో ఘోరంగా ఉన్నాయి. తాజాగా ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లాలో బాబుకు బిగ్ షాక్ త‌గిలింది. పార్టీలో కాపు నేత‌ల్లో కీల‌కంగా ఉన్న వరుపుల రాజా టీడీపీ చీఫ్ చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఇన్ చార్జ్ పదవికి వరుపుల రాజా రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి కారణాలు ఆయన తెలిపారు.

టీడీపీ మునిగిపోయే నావ అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి మనుగడ లేదన్నారు. టీడీపీలో ఒకే సామాజిక‌వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఉంద‌ని... ఆ పార్టీలో ఉన్న కాపు నేత‌ల్లో 80 శాతం మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని విమ‌ర్శించారు. కాపుల విష‌యంలో సీఎం జ‌గ‌న్ ముందు నుంచి ఒకే మాట మీద ఉన్నార‌ని చెప్పారు. పార్టీలో ఓ వర్గానికే పదవులు - కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు.

రాజ‌ధాని మారుస్తామ‌ని సీఎం జ‌గ‌న్ ఎక్క‌డా చెప్ప‌లేద‌ని... దీనిపై టీడీపీ నేత‌లు అన‌వ‌స‌రంగా రాద్దాంతం చేస్తున్నార‌ని రాజా మండిప‌డ్డారు. అంతేకాదు సీఎం జగన్ పాలన బాగుందని కితాబిచ్చారు. రాజ‌ధానిలో 90 శాతం భూములు ఒకే సామాజిక‌వ‌ర్గం వారు కొన్నార‌ని ఆయ‌న చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రక్షాళన జరుగుతోందన్నారు. పేదల సంక్షేమం - అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.

కేవ‌లం మూడు నెల‌ల్లోనే జ‌గ‌న్ పాల‌న‌లో ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌చ్చార‌ని రాజా ప్ర‌శంసించారు. బీజేపీలో చేరాల‌ని త‌న‌కు ఆఫ‌ర్ వ‌చ్చింద‌న్న రాజా త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. వరుపుల రాజాతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన మరికొందరు నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. రాజా తాజా ఎన్నిక‌ల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ వరుపుల రాజా 4611 ఓట్ల తేడాతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ చేతిలో ఓడిపోయారు.

ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో గెలిచిన వ‌రుపుల సుబ్బారావు ఆ త‌ర్వాత టీడీపీలో చేరి ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు మొన్న ఎన్నిక‌ల్లో ఓడిన రాజా కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవ‌డంతో అక్క‌డ టీడీపీ ఖాళీ అయిపోయింది.