Begin typing your search above and press return to search.

అధికారంలోకి వస్తే మతి మ‌రుపు వచ్చేస్తుందా?

By:  Tupaki Desk   |   4 Aug 2022 5:28 AM GMT
అధికారంలోకి వస్తే మతి మ‌రుపు వచ్చేస్తుందా?
X
బీసీల‌ను త‌రుచూ బ్యాక్ బోన్ క్యాస్ట్ అని అభివ‌ర్ణించే పాల‌క వ‌ర్గాలు వాటి మేలు కోసం ప‌న‌లు చేయ‌డం, చ‌ట్టాల‌లో సంస్క‌రణ‌లు చేయ‌డం, సంబంధిత రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌డం వంటివి మ‌రిచిపోతున్నారుని తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీపై విమర్శలు చేస్తోంది.

మరోవైపు తనకు వెన్నెముక వంటి బీసీ వర్గంతో స‌ఖ్య‌త‌గా ఉంటూ ఎలాగైనా వైసీపీపై పై చేయి సాధించాలని భావిస్తోంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక సంబంధిత బీసీ కార్పొరేష‌న్ ఊసు అన్న‌దే మ‌రిచిపోయింద‌న్నది టీడీపీ ఆరోపణ. అంతేకాదు ప‌థ‌కాల పేరుతో ఇస్తున్న‌వీ అరకొర‌గానే ఉంటున్నాయ‌ని మండి ప‌డుతోంది.

జంత‌ర్ మంతర్ వ‌ద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్ర‌తినిధులు నిర్వహించిన ధ‌ర్నాకు మ‌ద్దతు పలికి, వారి న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్లకు కేంద్రం ఆమోదం తెల‌పాల‌ని తెలుగుదేశం నేతలు గొంతు క‌లిపారు.

బీసీల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో యాభై శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న డిమాండ్ కు విప‌క్ష పార్టీ హోదాలో మ‌ద్ద‌తు ఇస్తూనే, తాను ఓబీసీని అని చెప్పుకుంటున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బీసీల సంక్షేమంపై దృష్టి సారించాల‌ని కోరారు.

ప్రజాస్వామ్యంలో నిరసనే ఆయుధం. వాస్త‌వానికి ఇటువంటి ధ‌ర్నాల కార‌ణంగా స‌మ‌స్య తీవ్ర‌త ప్రభుత్వాలకు తెలుస్తుంది. స్వయంగా బీసీ అయిన ఎంపీ రామూ చెప్పినవిధంగా కుల గణ‌న జ‌రిగితే దేశ జ‌నాభాలో అరవై శాతం దాటి బీసీలు ఉంటార‌ని, కానీ జనాభా ప్రాతిపదికన వారికి దక్కాల్సిన‌వేవీ దక్క‌డం లేద‌ని, ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానికి వీరి స‌మ‌స్య‌లు పరిష్క‌రించాల్సిన బాధ్య‌త ఉంద‌ని అన్నారు.

వీరి ధ‌ర్నాకు ఎంపీలు గ‌ల్లా జ‌య‌దేవ్, క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర మ‌ద్దతు ప‌లికి సానుకూల‌త వ్య‌క్తం చేశారు. బ‌డుగుల పార్టీగా ఉన్న తమ‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉంద‌ని స్ప‌ష్టం చేస్తోంది టీడీపీ. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రాగానే మరింతగా బీసీల అభివృద్ధికి వారి ఎదుగుదలకు టీడీపీ ఎప్పటిలానే ముందడుగు వేస్తుందని తెలుగుదేశం ఎంపీలు చెప్పారు.