Begin typing your search above and press return to search.

చిన్న రామయ్య దిగాల్సిందేనా...?

By:  Tupaki Desk   |   30 March 2022 2:30 AM GMT
చిన్న రామయ్య దిగాల్సిందేనా...?
X
పెద్ద రామయ్య పెట్టిన పార్టీకి నలభయ్యేళ్ళ వయసు నిండింది. కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తోంది అన్నది దీని బట్టే అర్ధమవుతోంది. ఇక ఎన్టీయార్ పార్టీని పద్నాలుగేళ్ల పాటు చిటికెన వేలుతో నడిపించారు. ఆయన చాలా సందర్భాల్లో ఒక మాట అనేవారు. తనతో పుట్టిన పార్టీ తనతోనే పోవాలని. దానికి కారణం వారసత్వ రాజకీయాల మీద ఆయనకు మక్కువ పెద్దగా లేకపోవడం. మరో వైపు పార్టీలో తన స్థాయి నాయకుడు లేడని ఎన్టీయార్ అప్పట్లో భావించడం.

కానీ అలా జరగలేదు. ఎన్టీయార్ బతికి ఉండగానే ఆయనను దించేసి టీడీపీకి చంద్రబాబు ప్రెసిడెంట్ అయ్యారు. ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అది చూసిన తరువాతనే ఎన్టీయార్ మనస్థాపంతో చనిపోయారు అని అంటారు. తన వారే తనను దించేసి అధికారాన్ని గుంజుకోవడం ఆయన్ని ఆ వృద్ధాప్యంలో తీవ్రంగా కలచివేసింది అని చెబుతారు.

ఇక ఎన్టీయార్ నుంచి అధికారం తీసుకున్న చంద్రబాబు నాయకుడిగా సమర్ధుడే. అందుకే టీడీపీ ఇన్నాళ్ళు మనగలిగింది. అయితే ఇపుడు బాబు కూడా ఏడున్నర పదుల వయసులోకి వచ్చేశారు. ఆయన తరువాత ఎవరు అన్న ప్రశ్న టీడీపీలో మళ్ళీ వస్తోంది. ఇపుడు మరోమారు ఎన్టీయార్ మాటలను గుర్తు చేసుకోవాల్సి వస్తోంది.

మరి చంద్రబాబుతోనే టీడీపీ పయనం ఆగిపోతుందా అంటే బాబు తన కుమారుడు లోకేష్ ని ముందు పెడుతున్నారు. కానీ లోకేష్ ని మాత్రం క్యాడర్ లీడర్ గా అంగీకరించలేకపోతోంది. ఎన్టీయార్ కి గ్లామర్ ఉంది. చంద్రబాబుకు పొలిటికల్ గ్రామర్ ఉంది. లోకేష్ విషయానికి వచ్చేసరికి ఈ రెండూ కూడా పెద్దగా లేవు అనే విమర్శలు ఉన్నాయి.

దాంతో తండ్రి చంద్రబాబు ఎంత ప్రోత్సాహం ఇచ్చినా ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసి అయిదు శాఖకు అప్పగించినా లోకేష్ ని బాబు తరువాత స్థానంలో టీడీపీ వర్గాలు ఊహించుకోలేకపోతున్నాయి. అదే సమయంలో జూనియర్ ఎన్టీయార్ వస్తే పార్టీ బాగుపడుతుందని, టీడీపీ మళ్లీ పవర్ లోకి వస్తుందని చాలా మంది అంటున్నారు.

అంటే తన మానాన తాను సినిమాలు చేసుకునే జూనియర్ టీడీపీకి జోష్ ఇస్తున్నారు. క్యాడర్ కి ఆశాదీపంగా కనిపిస్తున్నారు. నిజంగా కనుక ఆలోచిస్తే టీడీపీకి మూడవ తరంలో సరైన నాయకత్వం అందించాలంటే జూనియర్ పార్టీ బాధ్యతలు స్వీకరించాలన్న డిమాండ్ వస్తోంది.

అయితే చంద్రబాబు మాత్రం లోకేష్ చేతులలోనే పార్టీ ఉండాలనుకుంటున్నారు అని ప్రచారంలో ఉంది. అందుకే ఆయన జనసేనతో పాటు ఇతర పార్టీలతో పొత్తులను కోరుకుంటున్నారు తప్ప తన సొంత మేనల్లుడు జూనియర్ విషయం మాత్రం ప్రస్థావించడం లేదని అంటున్నారు. అయితే కాలం చాలా గొప్పది, ఇక క్యాడర్ కూడా ఉన్న నిజాలు విషయాలు ఇట్టే చెప్పేస్తారు.

అందువల్ల ఇవాళ కాకపోయినా రేపు అయినా టీడీపీ కోసం జూనియర్ ఎన్టీయార్ దిగి రావాల్సిందే అంటున్నారు. ఆయన కనుక ఒకసారి బరిలోకి దిగితే మాత్రం టోటల్ గా టీడీపీ సైకిల్ గేర్ మార్చుకుని పరుగులు తీస్తుంది అంటున్నారు. మరి చిన రామయ్య ఇపుడే వస్తారా లేక సినిమాలే ముఖ్యమని 2029 దాకా వెయిట్ చేస్తారా. అసలు ఆయన్ని చంద్రబాబు పిలుస్తారా. ఏమో ఇది ఫక్తు రాజకీయం. ఇక్కడ ఏమైనా జరగవచ్చు. అందువల్ల అంతా ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాల్సిందే.