Begin typing your search above and press return to search.

సోమిరెడ్డికి సీను అర్థమైపోయింది..

By:  Tupaki Desk   |   8 April 2017 10:34 AM GMT
సోమిరెడ్డికి సీను అర్థమైపోయింది..
X
నెల్లూరు టీడీపీ అంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటుంది. అందరూ పెద్ద లీడర్లే. ఉన్న లీడర్లు చాలరన్నట్లు, కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు లీడర్లు వచ్చి చేరారు. దాంతో వర్గపోరు - కుమ్ములాటలు - ఒకరిపై ఒకరు ఫిర్యాదులు. ఇలాంటి పరిస్థితిలో నెల్లూరు నుంచి మంత్రిగా ఉన్న నారాయణ ఏదో రకంగా నెట్టుకొస్తున్న తరుణంలో తాజా మంత్రివర్గ విస్తరణలో సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి కూడా మంత్రి పదవి సంపాదిచుకున్నారు. చంద్రబాబుకు చెవిలోన జోరీగలా తయారవడంతో ఆయన సోమిరెడ్డి బాధ తట్టుకోలేక మంత్రి పదవి ఇచ్చేశారు. దీంతో 13 సంవత్సరాల తరువాత మంత్రి హోదాలో ఆయన నెల్లూరుకు వచ్చారు. ఆ సందర్భంగా బల ప్రదర్శన చేయాలనుకున్నారు. పార్టీలోని రాజకీయ శత్రువులనూ పిలిచారు. వస్తే వారి ముందు తన పవర్ చూపించాలనుకున్నారు. కానీ... సోమిరెడ్డి ప్రోగ్రాంకు ఎవరూ రాలేదు.. ఆల్రెడీ మంత్రిగా ఉండడం వల్ల నారాయణకు మాత్రం రాక తప్పలేదట.

సోమిరెడ్డి స్వయంగా ఆహ్వానించినప్పటికీ ఆనం వివేకానందరెడ్డి - ఆనం రామనారాయణరెడ్డి - ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. పార్టీ హై కమాండ్‌ ఆదేశం మేరకు మంత్రి నారాయణ మాత్రం ఆద్యంతం సోమిరెడ్డి వెంటే ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ ముఖ్య నేతలు - ద్వితీయ శ్రేణి నాయకులు - కార్యకర్తలతో పాటు సర్వేపల్లి - నెల్లూరు సిటీ - రూరల్ - కోవూరు నియోజక వర్గాల నుంచి భారీగా జనాన్ని సమీకరించారు. అయితే... ఆనం వర్గం, ఆదాల వర్గం మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.

మంత్రి పదవి చేతికి రాగానే జిల్లాలోని వైరి వర్గాలతో పాటు, తటస్థంగా ఉన్న వారిని సైతం తన నాయకత్వంలోకి తెచ్చుకోవాలని అనుకున్నా కూడా ఆయన ప్లాన్లేవీ ఫలించలేదు. సోమిరెడ్డికి మంత్రి పదవి దక్కినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న ఆనం సోదరులు, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి శుక్రవారం సోమిరెడ్డి నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభకు హాజరు కాలేదు. సోమిరెడ్డి రెండు రోజుల కిందట వీరికి స్వయంగా ఫోన్‌ చేసి ర్యాలీ, బహిరంగ సభకు హాజరు కావాలని ఆహ్వానించినా వారు ముఖం చాటేసి సోమిరెడ్డిపై తమ అసంతృప్తిని బహిర్గత పరిచారు. రామనారాయణరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ కు బయల్దేరి వెళ్లారు. ఆనం వివేకానందరెడ్డి నగరంలోనే ఉన్నా రాలేదు. తన ఇంటికి కూత వేటు దూరంలోని నర్తకి సెంటర్‌ లో బహిరంగ సభ జరుగుతున్నా వివేకా ఇంట్లోనే ఉండిపోయారు. అత్యవసర పనుల పేరిట మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. మొత్తానికి సోమిరెడ్డి నాయకత్వానికి అక్కడ ఏమాత్రం ఆమోదం లేదని క్లియరైపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/