Begin typing your search above and press return to search.

బాబు మీద ఫైర్ బ్రాండ్లు గుర్రుగా ఉన్నారా?

By:  Tupaki Desk   |   19 Feb 2016 7:30 PM GMT
బాబు మీద ఫైర్ బ్రాండ్లు గుర్రుగా ఉన్నారా?
X
అధికార‌ప‌క్ష నేత‌లు అంటే ఎలా ఉండాలి? త‌మ అధినాయకుడ్ని ఎవ‌రైనా ఏదైనా అంటే విరుచుకుప‌డాలి. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు నోటి నుంచి మాట రాకుండా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాలి. తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేయాలి. కానీ.. ఏపీ అధికార‌ప‌క్షంలో అలాంటివేమీ క‌నిపించ‌ట్లేదు. నేను త‌లుచుకుంటే గంట‌లో ప్ర‌భుత్వం ప‌డిపోతుందంటూ విప‌క్ష నేత మీడియా సాక్షిగా స‌వాలు విసిరితే.. అధికార‌ప‌క్షం మొత్తం ఒక్క‌టై.. తామంతా సీఎంకు ద‌న్నుగా ఉన్నామ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేయాలి.

త‌మ మ‌ధ్య‌నున్న క‌ట్టును ప్ర‌ద‌ర్శించి.. విప‌క్ష నేత మాట‌ల్లో అర్థ‌మే లేద‌న్న‌ది తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం చేయాలి. తామంతా ఒక్క మాట మీద‌నే ఉన్నామ‌ని.. అస‌త్యాల‌తో అలాంటి మాట‌లు ఎలా చెబుతారంటూ విప‌క్ష నేత‌పై మండిపాటు ప్ర‌ద‌ర్శించాలి. కానీ.. బాబు పార్టీ నేత‌ల నోటి నుంచి అలాంటి మాట‌లే రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. గ‌తంలో బాబు మీద ఈగ వాల‌నిచ్చేందుకు సైతం ఒప్పుకోని ప‌లువురు నేత‌లు ఇప్పుడు ఏమీ ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం.

ఫైర్‌ బ్రాండ్ పేరున్న ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు నోరు విప్ప‌ట‌మే లేద‌న్న మాట వినిపిస్తోంది. అనంత‌పురం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్.. గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల న‌రేంద్ర‌.. రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. వ‌ర్ల రామ‌య్య‌.. బండారు స‌త్యానార‌య‌ణ‌మూర్తి లాంటి వాళ్లు ఎంద‌రో నోరు విప్ప‌క‌పోవ‌ట‌మే కాదు.. అస‌లు సీన్లోకే రావ‌టం లేదు. ఎవ‌రు ఎన్ని అన్నా.. త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు ఉంటున్నారే త‌ప్పించి క‌లుగ‌జేసుకొని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అండ‌గా నిల‌వ‌టం లేద‌న్న విమ‌ర్శ ఉంది.

సుదీర్ఘ‌కాలం త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చినా.. దాని ఫ‌లాలు అంద‌క‌పోవ‌టం.. ప‌ద‌వులు ఆశించిన వారికి మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌పోవ‌టం లాంటి కార‌ణాల‌తో వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని చెబుతున్నారు. వీట‌న్నింటితో పాటు.. చిన‌బాబు లోకేశ్ తో సత్ సంబంధాలు లేక‌పోవ‌టం మ‌రో కార‌ణమ‌ని తెలుస్తోంది. మొత్తంగా పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్‌ లు పెద‌వి విప్ప‌క‌పోవ‌టం ఏపీ అధికార‌ప‌క్షానికి ఇబ్బందిక‌రంగా మారింద‌న్న మాట వినిపిస్తోంది.