Begin typing your search above and press return to search.

గల్లీల్లో పోరాటం.. ఢిల్లీలో మౌనవ్రతం!

By:  Tupaki Desk   |   5 Jan 2018 11:30 PM GMT
గల్లీల్లో పోరాటం.. ఢిల్లీలో మౌనవ్రతం!
X
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఎంత వరకు? అసలు వారికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా పొందే హక్కు ఉన్నదనే సంగతైనా గుర్తుందా? వంటి అనుమానాలు ప్రజలకు తరచూ కలుగుతూ ఉంటాయి. తెలుగుదేశం నాయకులు కూడా తమ అధినేత మనసులోని మాటను చక్కగా గ్రహించి.. తమ సంభాషణల్లో ప్రసంగాల్లో ఎక్కడా... హోదా అనే మాట రాకుండా.. చాలా జాగ్రత్తగా ఆ అంశాన్ని స్కిప్ చేసేస్తుంటారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఇలాగే జరుగుతుంది. అయితే కేంద్రలో అధికారం వెలగబెడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులతోనే తగాదాకు దిగాల్సి వచ్చేసరికి తెదేపా వారికి ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చింది. హోదా ఇవ్వకుండా మోడీ మోసం చేశారంటూ.. ఇక్కడ గల్లీల్లో భాజపా వారితో తగాదా పెట్టుకున్నారు. యాదృచ్ఛికమైన తమాషా ఏంటంటే.. ఇదే రోజున ఢిల్లీలో తెదేపా - భాజపా ఎంపీలు అంతా ఉమ్మడిగా ప్రధాని నరేంద్రమోడీని కలిసి ప్రత్యేకహోదా అనే మాట తప్ప.. విభజన హామీలు - పోలవరం నిధులు గురించి పట్టించుకోవాలంటూ ఓ వినతిపత్రం ఇచ్చారు.

ఇంతకూ గుంటూరులో తెదేపా- భాజపా ఘర్షణ ఎందుకు వచ్చిందో గమనించాలి. జన్మభూమి సభల వేదిక వద్ద పోస్టరుపై మోడీ ఫోటో లేదని - కేంద్ర నిధులతో సంక్షేమ పథకాలు చేస్తూ మా ఫోటో పెట్టరా అంటూ భాజపా వారు గొడవకు దిగారు. మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేయలేదా అంటూ తెదేపా వర్గీయులు వారితో కలబడ్డారు. ఇలా మాటామాటా పెరిగి ఘర్షణగా మారింది.

చూడబోతే.. తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డ్రామా ఏంటో స్పష్టంగానే అర్థమవుతోంది. ఇక్కడ గల్లీల్లో భాజపా లడాయి పెట్టుకోవాల్సి వస్తే.. మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ నెపం పెడతారు. అదే ఢిల్లీలో ప్రధానిని కలిసే ఛాన్స్ వస్తే మాత్రం హోదా మాటెత్తకుండా.. మొగమాటపు నవ్వులు - మొక్కుబడి వినతులు కురిపించి వచ్చేస్తారు అని జనం అసహ్యించుకుంటున్నారు.