Begin typing your search above and press return to search.

మద్దాల - వల్లభనేని - సిద్ధా - కరణం - చలమలశెట్టి.. ఇలా చేరుతూ ఉంటే మా పరిస్థితి ఏంటీ సార్?

By:  Tupaki Desk   |   1 Sep 2020 11:30 AM GMT
మద్దాల - వల్లభనేని - సిద్ధా - కరణం - చలమలశెట్టి.. ఇలా చేరుతూ ఉంటే మా పరిస్థితి ఏంటీ సార్?
X
బెల్లం చుట్టూ ఈగలు.. అధికారం చుట్టూ ప్రజాప్రతినిధులు వాలిపోతూనే ఉంటారు. ఎన్నికలకు ముందు అసమ్మతులను గడపతొక్కనీయని వైఎస్ జగన్.. సీఎం అయ్యాక మాత్రం వలసనేతలను ప్రోత్సహిస్తున్నారన్న అపవాదు ఉంది. ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలను వైసీపీలోకి చేర్చుకున్నారు. ఏపీలో ఈ విచిత్రమైన పరిస్థితి గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది.

అసలు విషయానికి వస్తే.. 2014 ఎన్నికల్లో వైసీపీపై కేవలం 1 శాతం తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత వైసీపీని పూర్తిగా తొక్కేయాలని.. 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చంద్రబాబు చేర్చుకున్నారు. కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. అప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగింది.

వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నాడు నిండు అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించాడు. అంతేకాకుండా వాక్ అవుట్ చేసి.. వాళ్లు ఉన్నంత వరకు అసెంబ్లీకి రాము అని స్పష్టం చేశాడు. ఆ సమయంలో నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. సోషల్ మీడియాలోనూ దీన్ని హైలెట్ చేశారు.

జగన్ పాదయాత్రలో దీన్నే అస్త్రంగా మలిచారు. ప్రతీ సభలోనూ వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా లాగేసి చంద్రబాబు మంత్రులను చేశాడని.. నేను అలా చేయను అని చెప్పి మరీ అధికారంలోకి వచ్చాడు జగన్.

అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 23మంది ఎమ్మెల్యేల్లో ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రమే మొన్నటి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాడు. కట్ చేస్తే.. ఇప్పుడు కూడా టీడీపీ హయాంలో జరిగినట్టే జరుగుతోందన్న ఆవేదన వైసీపీలో ఉందట.. డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకు కండువా కప్పకుండా వాళ్ల కొడుకులకు.. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు, టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన వాళ్లకు డైరెక్ట్ గా కండువా కప్పుతున్నారు. అంతే తేడా అని.. ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.

టీడీపీకి వైసీపీకి ఏమీ తేడా ఉందని.. మొత్తానికి వాళ్ల స్వార్థం చూసుకొనే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రెండు పార్టీల్లో దెబ్బతినే పరిస్థితి వస్తోందని అంటున్నారు. తప్పితే జంప్ అయిన వాళ్లు ఆర్థికంగా లాభపడటం.. వాళ్ల కార్యకర్తలకు మేలు చేయడం తప్పితే.. ఏమీ లేదు అని.. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని గ్రామాల్లోని రచ్చబండ ఏరియాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటూ ఇలా అయితే కోట్లు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం వేస్ట్ అని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇదే చర్చ జరుగుతోంది.