Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ అసెంబ్లీకి రాక‌పోతే ఫీల‌వుతున్న టీడీపీ

By:  Tupaki Desk   |   10 Nov 2017 3:46 AM GMT
జ‌గ‌న్ అసెంబ్లీకి రాక‌పోతే ఫీల‌వుతున్న టీడీపీ
X
అవును...ఏపీలో ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత - వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి త‌మ పార్టీ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకాక‌పోతే అధికార తెలుగుదేశం పార్టీ ఫీల‌వుతోంద‌ట‌. ప్ర‌తిప‌క్షం లేని స‌భ‌లో తాము ఎలా చురుకుగా స్పందించ‌గ‌లుగుతామ‌ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చ‌ర్చించుకుంటున్నార‌ట‌. తామే ప్ర‌శ్నించుకోవ‌డం..తామే స్పందించ‌డం...తామే సంతృప్తి ప‌డ‌టం వంటివి ఒకింత ఎబ్బెట్టుగా ఉంటాయ‌ని అంటున్నారు. ఆత్మస్తుతి...ప‌రనింద‌కు వేడుక‌గా అసెంబ్లీ స‌మావేశాలు మార‌నున్నాయ‌ని కొంద‌రు ఎమ్మెల్యేల్లో చ‌ర్చ సాగుతోంద‌ని చెప్తున్నారు.

మ‌రోవైపు మంత్రులు అసెంబ్లీ గైర్హాజ‌రు గురించి ప‌దే ప‌దే...అన్నిచోట్లా ప్ర‌స్తావించ‌డం చూస్తుంటే..వైసీపీ నేత‌ల కంటే టీడీపీ నేత‌లే...అసెంబ్లీ బ‌హిష్క‌ర‌ణ గురించి ఎక్కువగా ఫీల‌వుతున్నట్లుంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. స‌ద‌రు చ‌ర్చ నిజ‌మే అన్న‌ట్లుగా...మంత్రులు ప‌లువురు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీని బహిష్కరించడం అప్రజాస్వామికమన్నారు. ఏ ఉద్దేశంతో జ‌గ‌న్ అసెంబ్లీని బ‌హిష్క‌రించారో తెలియ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. జగన్‌ కు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి లేనందునే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడన్నారు.

జగన్‌ అసెంబ్లీ బహిష్కరణ ప్రకటనను మంత్రి పితాని సత్యనారాయణ తప్పుపట్టారు. వైకాపా అధినేత జగన్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్తం చేస్తున్నారని మంత్రి పితాని అన్నవరంలో అన్నారు. వైకాపా అధినేత జగన్‌ పాదయాత్రపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని మంత్రి జవహర్‌ రెడ్డి బుధవారం అన్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి జగన్‌ చారిత్రక తప్పిదం చేస్తున్నాడన్నారు. పాదయాత్ర ఉద్దేశం ఏమిటని అడిగితే ఇంతవరకూ సమాధానం రాలేదన్నారు. ఇది ప్రజా సంకల్పయాత్ర కాదు.. జగన్‌ సీఎం సంకల్పయాత్ర అన్నారు. సీఎం అయ్యే అవకాశం లేదని తెలిసీ జగన్‌ యాత్ర చేస్తున్నాడని జవహర్‌ అన్నారు.