Begin typing your search above and press return to search.

పోలవరం సక్సెస్ తో క్విడ్ ప్రోకో బురద…?

By:  Tupaki Desk   |   22 Sep 2019 5:15 AM GMT
పోలవరం సక్సెస్ తో క్విడ్ ప్రోకో బురద…?
X
పోలవరం రివర్స్ టెండరింగ్ ఘన విజయంతో దిక్కుతోచని స్థితిలో పడిన తెలుగు దేశం పార్టీ తమను తాము కాపాడుకునేందుకు - ప్రజల దృష్టిని మరల్చేందుకు అర్థం పర్థం లేని ఆరోపణలకు దిగుతోంది. కోట్ల రూపాయలను టీడీపీ అనునాయులకు కట్టబెట్టారనే విషయం తేటతెల్లం కావడంతో ఉక్కిరిబిక్కిరై పసలేని - పొంతనలేని - దిగజారుడు ఆరోపణలకు దిగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వాతావరణాన్ని మరింతగా దిగజారుస్తున్నది. తెలుగు దేశం పార్టీ తమ వారికి చెందిన కంపెనీ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా - అధికార పార్టీ ప్రతీ చర్యను - ప్రతీ కాంట్రాక్టును విమర్శించడం ప్రారంభించింది. అందులో భాగంగానే మేఘా కృష్ణారెడ్డి - ఆయన గ్రూపు కంపెనీలపై విరుచుకుపడుతున్నాయి. మరోసారి క్విడ్ ప్రోకో ఆరోపణల అస్త్రాన్ని బయటకి తీసింది. ఇంతవరకు పోలవరం ప్రాజెక్టులో ఒక్క పనిని కూడా మేఘా ఇంజినీరింగ్ కు కట్టబెట్టకుండానే - ప్రధాన పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలు కాకుండానే మొత్తం పొలవరం ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్ కు కట్టబెడుతున్నారంటూ తెలుగు దేశం సీనియర్ నాయకులంతా కట్టకట్టుకుని - పోలవరం ప్రాజెక్టుతో పాటు విద్యుత్ బస్సుల కొనుగోలు వ్యవహారం పైనా ఆరోపణలు కురిపిస్తున్నారు.

టీడీపీ తప్పుడు ప్రచారం:

పోలవరం రివర్స్ టెండరింగ్ విజయవంతమైన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు తెరతీసింది. పోలవరం ప్రాజెక్టును దాదాపు ఐదారు వందల కోట్ల రూపాయల తక్కువకు మేఘా ఇంజినీరింగ్ కు కట్టబెట్టి - అందులో వచ్చే నష్టాన్ని మరో రకంగా తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందట. అందుకు మేఘా అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుంచి వచ్చే ఐదేండ్లలో దశ వారీగా దాదాపు రూ. 3380 కోట్ల విలువైన బస్సులను జగన్ ప్రభుత్వం కొనుగోలు చేయనుందని ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఏడాది కిందట ఇదే చంద్రబాబు ఒలెక్ట్రా బస్సులో తన అనుచరుతో కలిసి ప్రయాణించారనే విషయాన్ని ఆ పార్టీ నాయకులే మరచినట్టున్నారు. ఎలక్ట్రిక్ బస్సు ఎక్కి కాలుష్యంలేని అమరావతి అని చెప్పిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

చంద్రబాబు హయాంలోనే కొనుగోలు ప్రక్రియ:

ఎలక్ట్రిక్ బస్సులను ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రవేశపెడుతున్నారు. ఫేమ్-2 (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) విధానం కింద దేశంలో 7090 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి రూ. 3545 కోట్ల ప్రణాళికను కేంద్రం ప్రకటించింది. మొత్తం అన్ని రకాల వాహనాలను కలిపితే మొత్తం పదివేల కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రాల రవాణా సంస్థలు విద్యుత్ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రతి కిలోవాట్ సామర్థ్యానికి రూ. 20 వేల రాయితీని కూడా ప్రకటించింది. అలాగే రాష్ట్ర రవాణా సంస్థ నిర్వహణ వ్యయాల ఆధారంగా కూడా రాయితీలను కేంద్రం భరించనుంది. ఇందులో భాగంగానే అనేక రాష్ట్రాలు విద్యుత్ వాహానాల విధానాలను ప్రకటించాయి. విద్యుత్ బస్సుల కొనుగోలుకు రాష్ట్రాలు టెండర్లను పిలుస్తున్నాయి. ఈ ప్రక్రియ చంద్రబాబు హయాంలోనే మొదలైంది. ఇప్పుడు జగన్ వచ్చిచేస్తున్నదల్లా చంద్రబాబు విధానాలను కొనసాగిస్తూ.. మేఘా కంపెనీ నుంచి బస్సులను కొనుగోలు చేయడమే.

1500 కోట్లు 20 వేల కొట్లు ఎలా అవుతుంది.?

ప్రస్తుతం దాదాపు రూ. 1500 కోట్లుగా ఒలెక్ట్రా గ్రీన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20,000 కోట్ల కు చేరుతుందట. అందువల్ల మేఘా కృష్ణారెడ్డికి కంపెనీలో వున్న వాటా విలువ వెయ్యి కోట్ల నుంచి ఏకంగా 11 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందట. ఈ లెక్క స్టాక్ మార్కెట్ నిపుణులెవరికీ చూపించినా నవ్వుకుంటారు. తెలుగు దేశం పార్టీ అంటున్నట్టుగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత రూ. 1528.35 కోట్లు. ఈ కంపెనీ మేఘా హోల్డింగ్స్ వాటా 44.47. శాతం. అంటే మేఘా హోల్డింగ్స్ వాటా విలువ రూ. 679.66 కోట్లు. శుక్రవారం నాటికి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ షేరు ధర నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజిలో రూ. 192.05 వద్ద ముగిసింది. తెలుగు దేశం వారు ఆరోపిస్తున్నట్టుగా ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20,000 కోట్లకు చేరుకోవాలంటే షేరు ధర కనీసం రూ. 2520 చేరుకోవాలి. మరి చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ 1992 లో స్థాపించి 1994లో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇన్నేండ్లు అధికారంలో ఉండి అన్ని ప్రభుత్వ కార్యాయాలతో హెరిటేజ్ పాలనే కొనిపించినా సరే 25 ఏండ్ల తర్వాత కూడా హెరిటేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంకా రూ. 1754.54 కోట్ల రూపాయలుగానే ఎందుకు ఉన్నట్టు?

బీవైడీతో ఓలెక్ట్రా ఒప్పందం:

గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రా టెక్ ఒలెక్ట్రాగా మారకముందే చైనాకు చెందిన అతిపెద్ద బ్యాటరీ కంపెనీ బీవైడీతో ఒప్పందం చేసుకుంది. బీవైడీ పోటీ కంపెనీ టెస్లా బ్యాటరీలు విఫలమై పేలిపోయాయి. ఇప్పటివరకు బీవైడీ బ్యాటరీలు పేలిన లేదా పనిచేయకుండా విఫమైన సందర్భాలు లేవు. ఈ కారణంగానే బీవైడీలో కేవలం 1.92 శాతం వాటా కోసం సామ్ సంగ్ 450 మిలియన్ డాలర్లు చెల్లించింది. ప్రపంచంలోనే ధనవంతుడు వారెన్ బఫెట్ కూడా వాటా ఉన్న బీవైడీ ఇండియా మరిన్ని పెట్టుబడు పెట్టడానికి సిద్ధంగా వుంది. ఇప్పటికే కార్లతో సహా వివిధ రకాల వాహనాలను ప్రపంచ మార్కెట్ లో ప్రవేశపెట్టిన బీవైడీ దేశీయ మార్కెట్ లోకి వ్యాన్లను కూడా త్వరలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇదీ బీవైడీ చరిత్ర. ఇంత పెద్ద కంపెనీతో గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రా టెక్ గా ఉన్నప్పుడే ఒప్పందం కుదిరింది. ఇది మేఘా కృష్టారెడ్డి కొత్తగా లింకెట్టింది కాదు.

అమరావతిలోనే ఒలెక్ట్రా తొలి ప్రదర్శన:

ఒలెక్ట్రా గ్రీన్ టెక్ బస్సులు ఇప్పటికే అనేక రాష్ట్రాలలో తిరుగుతున్నాయి. తొలిసారిగా ప్రదర్శించింది అమరావతిలోనే. ఆ తర్వాత తిరుమ కొండకు ట్రయల్ నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి నుంచి రోహతంగ్ పాస్ వరకు అత్యంత ఎత్తైన ప్రదేశానికి ప్రయాణించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ఎక్కింది. దీనికి తోడు కేరళలో అయ్యప్పస్వామి యాత్రకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ - కర్ఱాటక - మహారాష్ట్ర - తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. గత వారమే ముంబయ్ లో దాదాపు పది ఒలెక్ట్రా బస్సులను సీటీ సర్వీసు కోసం బెస్ట్ ప్రవేశపెట్టింది. పూణేలో సీటీ బస్సులుగా నడుస్తున్నాయి. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడుస్తున్న 40 ఎలక్ట్రిక్ బస్సులు ఒలెక్ట్రావే. ఇక్కడ మరో విషయం అశోక్ లేలాండ్ కూడా ఇటీవలే ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నా అవి ఎత్తైన ప్రదేశాలను చేరుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాలలో విజయవంతంగా నడుస్తున్నవి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ బస్సులే. ఇవి కాక, ఉత్తరప్రదేశ్ - ఢిల్లీ - తమిళనాడు - కర్ణాటకతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రం ఇస్తున్న రాయితీని ఉపయోగించుకోవడానికి విద్యుత్ బస్సుల కోసం టెండర్లను పిలుస్తున్నాయి. ఫేమ్ 2 లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలో విద్యుత్ బస్సుల కోసం టెండర్లను పిలువొచ్చు. ఈ టెండర్లలో ప్రమాణాలు - ఉత్పత్తి సామర్థ్యం - సాంకేతిక అంశాల కారణంగా బస్సుల కొనుగోలు జరుగుతుంది.

ఈ వాస్తవాన్నీ మరిచి సీఎం జగన్ కు కంపెనీలో పరోక్ష వాటాను అంటగట్టడం - క్విడ్ ప్రో కో జరిగినట్టు వక్రీకరించడం చూస్తుంటే నిన్నటి దాకా ఏటిఎంగా వాడుకున్న పోలవరం తమ వారి చేతి నుంచి తప్పి పోతుందన్న కడుపు మంట తప్ప మరేది కనిపించడంలేదు.