Begin typing your search above and press return to search.

ఆ కార్యక్రమంలో రోజా ఎందుకు కనపడలేదు?

By:  Tupaki Desk   |   12 Aug 2019 4:44 AM GMT
ఆ కార్యక్రమంలో రోజా ఎందుకు కనపడలేదు?
X
ఇన్వెస్టర్ల సమ్మిట్ లో ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ఎందుకు కనిపించ లేదు? అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వర్గాలు హైలెట్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన ఉన్నత స్థాయి వర్గాలు ఆ కార్యక్రమానికి హాజరయ్యాయి. ఏపీలో పెట్టుబడులకు తగిన అవకాశాలు ఉన్న వైనాన్ని ఆ ప్రోగ్రామ్ లో వివరించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం ఆకట్టుకుంది కూడా. అయితే కీలకమైన ఆ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ కనిపించకపోవడం మాత్రం తెలుగుదేశం పార్టీ వర్గాలకు ఆయుధంగా మారింది.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు నడుస్తూ ఉన్నాయని - అందుకే రోజాకు ఆ కార్యక్రమంలో చోటు దక్కలేదని ఆ వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. రోజాకు మంత్రి పదవి దక్కనప్పుడు కూడా తెలుగుదేశం వర్గాలే ఆ అంశాన్ని బాగా హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డికి ఆమెకు ఏపీఐఐసీ వంటి కీలక సంస్థకు చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఆ హోదాలో ఆమె కియా కార్ల ఆవిష్కరణకు కూడా హాజరయ్యారు. అయితే ఇన్వెస్టర్ల సమిట్ కు హాజరు కాలేదు.

ఆమెకు జగన్ ప్రాధాన్యతను ఇవ్వడం లేదని, అందుకే ఆమె ఆ కార్యక్రమంలో కనిపించలేదని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి రచ్చ కొనసాగుతూ ఉంది.

అయితే అలాంటిదేమీ లేదని, రోజా తన బాధ్యతల్లో తను ఉన్నారని - కియా కార్యక్రమానికి ఆమె హాజరు కావడమే అందుకు రుజువని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఆర్కే రోజా గైర్హాజరి ఇలా చర్చనీయాంశంగా మారింది.