Begin typing your search above and press return to search.

పోలీసు స్టేష‌న్ల‌లో వైసీపీ సెటిల్మెంట్లు ?

By:  Tupaki Desk   |   19 March 2022 3:21 AM GMT
పోలీసు స్టేష‌న్ల‌లో వైసీపీ సెటిల్మెంట్లు ?
X
జ‌గ‌న్ ఓ వైపు క్షేత్ర స్థాయి అవినీతి ని ఆపాల‌ని చెబుతుంటే మ‌రోవైపు ఎమ్మెల్యేలు త‌మ‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ అవకాశం రాద‌న్న చందంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్న ఆరోప‌ణ ఒక‌టి టీడీపీ నుంచి వ‌స్తోంది. ముఖ్యంగా పోలీసులు కూడా వేధింపుల ప‌ర్వాన్ని య‌థేచ్ఛ‌గా సాగిస్తున్నారు.దీంతో చాలా చోట్ల బ‌ల‌వ‌న్మ‌రణాలు న‌మోదు అవుతున్నాయి.అయినా కూడా వైసీపీ స‌ర్కారు బాధిత గొంతుకుల‌ను అర్థం చేసుకోవ‌డం లేద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆవేద‌న చెందారు. క‌క్ష సాధింపులో భాగంగానే చాలా మంది వైసీపీ నాయ‌కులు త‌మ‌ను కేసుల్లో ఇరికిస్తూ ఉన్నార‌ని ఇందుకు పోలీసు స‌హ‌కారం ఎంత‌గానో ఉంద‌ని టీడీపీ అభియోగాలు న‌మోదు చేస్తోంది.

ఆంధ్రావ‌నిలో అనుమానాస్ప‌ద మృతుల‌కు లోటేలేదు.అందుకు కార‌ణాలు మాత్రం పోలీసులే ! ముఖ్యంగా ఓ వ‌ర్గాన్ని ల‌క్ష్యంగా ఎంచుకుని వీరంతా దాడులు చేస్తున్నార‌ని యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు మొన్న‌టి వేళ ప‌లాస కేంద్రంగా వ్యాఖ్య‌నించారు. ఇప్ప‌టికే ఎంద‌రో తెలుగు దేశం కార్య‌క‌ర్త‌లు ఇళ్లు దాటి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నార‌ని, పోలీసు చ‌ర్య‌ల కార‌ణంగానే వీరంతా హ‌డ‌లి పోతున్నారు అని ఆయ‌న ఆవేద‌న చెందారు. రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్న సైతం ఇదే విష‌యాన్ని ధ్రువీక‌రిస్తున్నారు.పోలీసు స్టేష‌న్ల‌లో చాలా చోట్ల వైసీపీ నాయ‌కులు సెటిల్ మెంట్ చేస్తున్నార‌ని,ఇందుకు ఎమ్మెల్యేల స‌హ‌కారం ఎంత‌గానో ఉంద‌ని సాక్షాత్తూ సీఎంఓ కూడా ధ్రువీక‌రిస్తోంది.

మొన్న‌టి వేళ ప‌నిచేయ‌ని కాదు అవినీతి కి అల‌వాటు ప‌డిపోయిన ఎమ్మెల్యేల జాబితాలో 50 పేర్లు ఉన్నాయి.ఈ కోవ‌లో డిప్యూటీ సీఎం స్థాయి వ్య‌క్తులు కూడా స్టేష‌న్ సెటిల్ మెంట్ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో ఆధార స‌హితంగా వ‌స్తున్నా కూడా సంబంధిత వ‌ర్గాలు అప్ర‌మ‌త్తం అవ్వ‌డం లేదు.డిప్యూటీ సీఎం దాస‌న్న‌పై కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లే వ‌స్తున్నాయి.కానీ ఆయ‌న అవి ప‌ట్టించుకోవ‌డం లేదు. ల్యాండ్ మాఫియా శ్రీ‌కాకుళంలో రెచ్చిపోతోంది. పోలీసులే వారికి అండ‌గా ఉన్న దాఖ‌లాలు ఉన్నాయి అని టీడీపీ ఆరోపిస్తుంది.గ‌తంలో ప‌లాస కేంద్రంగా ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. ఆ రోజు ఎమ్మెల్యే గౌతు శ్యామ సుంద‌ర శివాజీ అల్లుడు వెంక‌న్న చౌద‌రి రెచ్చిపోయారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అల్లుడి ట్యాక్స్ పై మండి ప‌డ్డారు.

ఆ కార‌ణంగానే శివాజీ కుటుంబం ప‌ద‌వి కోల్పోయి ఇప్పుడు అవ‌మాన భారంతో రోజులు నెట్టుకుని రావాల్సి వ‌స్తోంది.ఇదే ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో మంద‌స మండ‌లంలో ఇటీవ‌ల కోన వెంక‌ట రావు అనే టీడీపీ కార్య‌క‌ర్త పోలీసుల వేధింపులు తాళ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.దీనిపై వైసీపీ శ్రేణులు స్పందించిన తీరు అత్యంత హేయంగా ఉంద‌ని యువ ఎంపీ రాము ఆవేద‌న చెందారు.దీంతో ఆ రోజు వైసీపీ విష‌య‌మై టీడీపీ చేసిన త‌ప్పిదాలే ఇప్పుడు టీడీపీ విష‌య‌మై వైసీపీ చేస్తోంద‌ని రాజకీయ ప‌రిశీల‌కులు అంటున్నారు