Begin typing your search above and press return to search.

వైసీపీని విమర్శించేవారు ఈ పాయింట్ ఆలోచించారా?

By:  Tupaki Desk   |   20 July 2018 4:58 PM GMT
వైసీపీని విమర్శించేవారు ఈ పాయింట్ ఆలోచించారా?
X
అవిశ్వాసం నేపథ్యంలో ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంటు సాక్షిగా గళమెత్తే అవకాశాన్ని వైసీపీ చేజార్చుకుందని.. తమ ఎంపీలతో రాజీనామా చేయించడంతో వారికి అక్కడ ప్రాతినిధ్యమే లేకుండాపోయిందని... ఇలా ఎన్నో విమర్శలు వైసీపీపై వస్తున్నాయి. కానీ... రాజకీయ విలువలు పాటించే పార్టీగా వైసీపీ ఈ రోజు సభలో లేకపోవడమే మంచిదైందని విశ్లేషకులు అంటున్నారు. ఈ రోజు సభలో వివిధ పార్టీల తీరు చూస్తే - సభ్యుల అనైతిక వ్యవహారం చూస్తే అలాంటి పరిస్థితికి సాక్షీభూతంగా ఉండకపోవడమే అదృష్టమని.. గత నాలుగేళ్లుగా పార్లమెంటులో క్రమం తప్పకుండా రాష్ట్ర సమస్యలను ప్రస్తావించిన వైసీపీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తమకు దక్కే అయిదారు నిమిషాల సమయంలో కొత్తగా చెప్పాల్సింది.. చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని అంటున్నారు. ప్రజలకు ఇదంతా తెలుసని.. కేవలం ప్రత్యర్థి పార్టీలు మాత్రమే ఇలాంటి పస లేని ఆరోపణలు చేస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.

ఈ రోజు సభలో పరిస్థితి చూస్తే అవిశ్వాసంపై చర్చను ప్రారంభించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పక్కన కూర్చున్న ఎంపీ మల్లారెడ్డి నిజానికి ఎప్పుడో టీడీపీని వీడారు. టీఆరెస్‌ లో కలిశారు. కానీ.. టెక్నికల్‌ గా ఆయన టీడీపీ సభ్యుడిగా ఉండడం వల్ల వారితో కలిసి కూర్చున్నారు. కూర్చోబెట్టుకున్న టీడీపీకి... కూర్చున్న మల్లారెడ్డికి కూడా ఏమాత్రం విలువలు ఉన్నట్లుగా కనిపించలేదు.

ఇక వైసీపీని వీడి టీడీపీలో చేరిన బుట్టారేణుక వంటివారు ఇంతకాలం టీడీపీ తరఫున ఉన్నా ఈ రోజు టెక్నికల్ గా వారు వైసీపీ సభ్యులిగా కనిపించారు. అదే వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉండకపోతే సభలో ఈ ఫిరాయింపు ఎంపీలను పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వచ్చేదని వైసీపీ నేతలు అంటున్నారు. విలువల్లేని రాజకీయాలు చేసే నేతలతో ఇలా ఒక రోజు వేషం కలవాల్సిన అవసరం వైసీపీకి లేదని అంటున్నారు.