Begin typing your search above and press return to search.

హీరో ‘హోదా’ కోసం ప్రయత్నాలు

By:  Tupaki Desk   |   31 July 2016 12:48 PM GMT
హీరో ‘హోదా’ కోసం ప్రయత్నాలు
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిజంగానే విధివంచితగా మారిపోతోంది. అడ్డగోలుగా విభజనతో అనాథగా మారిన రాష్ట్రానికి అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం - రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పరుగులు తీస్తున్నాయి కానీ రాష్ర్ట ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో అడుగులు వేయడం లేదు. దీంతో ఏపీ ప్రత్యేక హోదా అంశం నాలుగు స్తంభాలాటలా మారిపోయింది. నాలుగు ప్రధాన పార్టీలు ఎవరికి వారు రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని బలి పశువును చేస్తున్నారు. అధికార తెదేపా - ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా - రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ - దానిని సమర్థించి ఇప్పుడు చిక్కుల్లో పడిన భాజపా హోదాపై రాజకీయ క్రీడల్లో మునిగిపోయాయి. హోదాపై సంయుక్త పోరాటం బదులు - ఒకరిపై ఒకరు బురద చల్లుకునే రాజకీయ వ్యూహానికి తెరలేపాయి. హోదా పోరాటంలో ఎవరికి వారే హీరోలు కావాలని ప్రయత్నం చేస్తూ ప్రత్యేక హోదా పోరు మాని హీరో హోదా కోసం యుద్ధాలు చేస్తున్నారు.

హోదా అంశంలో తప్పంతా కాంగ్రెస్ - బిజెపిదేనన్న కొత్త కోణంలో తెదేపా తన వ్యూహం రచించింది. ఇప్పటివరకూ కేంద్రంలోని బిజెపిపై వౌనం వహించిన బాబు తాజాగా బిజెపిపై స్వరం పెంచారు. దీంతో ఆ పార్టీ ఎంపీలు కూడా విమర్శల దాడికి పదునెక్కిస్తున్నారు. విజయవాడ ఎంపి కేశినేనినాని ఒకడుగు ముందుకేసి - బాబు వంటి నమ్మకమైన మిత్రుడిని పోగొట్టుకుంటే బిజెపికే నష్టమని వ్యాఖ్యానించారు. టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి హోదా వ్యవహారం మోదీ విశ్వసనీయతపై ఆధారపడి ఉందని బిజెపిని ఇరికించే ప్రయత్నం చేశారు. మరో మాజీమంత్రి గాలి మరీ తీవ్రస్థాయిలో స్పందిస్తూ - హోదా ఇచ్చేంతవరకూ బిజెపి నేతలను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపి సీఎం రమేష్ కాంగ్రెస్-బిజెపి కలసి కుట్ర చేస్తున్నాయన్నారు. ఈ విమర్శల లక్ష్యం అంతా బిజెపితో మొహమాటం లేదని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న సంకేతాలు పంపించడమే తెదేపా రాజకీయ వ్యూహంగా స్పష్టమవుతోంది. కాగా, సోమవారం లోక్‌ సభలో హోదాపై వాయిదా తీర్మానం ఇవ్వడం ద్వారా తాము మాత్రమే దానికోసం పోరాడుతున్నామన్న సంకేతాలకు తెదేపా సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌ కు రాష్ట్రం నుంచి లోక్‌ సభలో సభ్యులు లేకపోవడం, బిజెపికి ఇద్దరు ఎంపీలున్నా వారెవరూ మాట్లాడేవారు కాకపోవడంతో, లోక్‌ సభలో సంఖ్యాబలంతో రాజకీయంగా లాభపడాలని తెదేపా భావిస్తోంది.

ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా తెదేపాను లక్ష్యంగా చేసుకుని రాజకీయ వ్యూహం రచిస్తోంది. హోదాపై కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆగస్టు2న రాష్టబ్రంద్‌ కు పిలుపునిచ్చింది. హోదాపై బాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేస్తోంది. ఓటుకునోటు భయంతోనే బాబు కేంద్రానికి భయపడుతున్నారన్న కోణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. బంద్ ద్వారా తెదేపా వైఫల్యాన్ని ప్రజల ముందుంచి, బాబును ముద్దాయిగా నిలబెట్టడమే వైకాపా లక్ష్యంగా కనిపిస్తోంది. తెదేపాకు పోటీగా వైకాపా కూడా సోమవారం లోక్‌ సభలో హోదాపై వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా హోదా ఇవ్వకపోయినా తెదేపా కేంద్రం నుంచి బయటకురాకుండా ఉండిపోతే, తాము మాత్రమే హోదా కోసం పోరాడుతున్నామన్న సంకేతాల కోసం రాజకీయ వ్యూహానికి పదును పెడుతోంది.

ఇక రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ - హోదాతో మళ్లీ ప్రజలకు చేరువయ్యే పనిలో ఉంది. కోటి సంతకాల సేకరణ విఫలమయిన తర్వాత మీడియా సమావేశాలకే పరిమితమైన కాంగ్రెస్ - కెవిపి ప్రైవేటు బిల్లుతో మళ్లీ జనంలోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆగస్టు 2న వైకాపా తలపెట్టిన రాష్ట్ర బందుకు మద్దతు ప్రకటించింది. ఈ మొత్తం రాజకీయ క్రీడలో బిజెపి పూర్తిగా వెనుకబడిపోయింది. రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చామన్న పాత పాట పాడడం తప్ప ఇంకేమీ చెప్పలేకపోతోంది. రెండు రోజులుగా నుంచి మిత్రపక్షమైన తెదేపా చేస్తున్న విమర్శలకు జవాబు చెప్పేవారు బీజేపీలో భూతద్దం వేసినా కనిపించడం లేదు. కేంద్రంలోని తమ పార్టీ చేసిన తప్పు వల్ల రాష్ట్ర బీజేపీ ముఖం చూపించలేకపోతోంది.