Begin typing your search above and press return to search.

జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో..తమ్ముళ్లలో కొత్త వణుకు!

By:  Tupaki Desk   |   12 Jun 2020 4:31 AM GMT
జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో..తమ్ముళ్లలో కొత్త వణుకు!
X
ఇప్పటివరకూ నడిచిన రాజకీయాలకు భిన్నమైన రాజకీయం ఏపీలో కనిపించనుందా? మొన్నటివరకూ విమర్శలు.. ఆరోపణలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇంతకాలం మాటలకే పరిమితమైన రాజకీయం ఇప్పుడు చేతల్లో చూపించనున్నారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. గురువారం ఏపీ మంత్రిమండలి సమావేశం తాజా రాజకీయ కలకలానికి కారణంగా చెప్పక తప్పదు. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫైబర్ నెట్.. చంద్రన్న కానుక.. రంజాన్ తోఫాల్లో అవకతవకలు జరిగినట్లుగా మంత్రివర్గ ఉప సంఘం తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది.

దీనిపై చర్చించిన మంత్రిమండలి.. ఈ అంశాల్లో సమగ్ర విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఫైబర్ నెట్ విషయంలోకేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో వాటిని ఎలా ఉల్లంఘించారన్న విషయాన్ని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన వివరించారు. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేసిన వివరాలు కనిపించటంతో దీనిపై సీబీఐ విచారణకు కోరాలన్న నిర్ణయానికి వచ్చారు.

ఇదిలా ఉంటే..ఈ రోజు ఉదయం శ్రీకాకుళం జిల్లాలోని తన నివాసంలో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఏసీబీ అదుపులోకి తీసుకోవటం.. ఆయన్ను వెంటనే పోలీసులకు అప్పజెప్పటం.. విజయవాడకు తరలించేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకోవటం వరుసగా చోటు చేసుకున్నాయి.

రెండు రోజుల వ్యవధిలో చోటు చేసుకున్నకీలక పరిణామాలు తాజాగా తెలుగు తమ్ముళ్లలో వణుకు పుట్టేలా చేస్తున్నాయి. తాజా నిర్ణయాలు చూస్తుంటే.. జగన్ సర్కారు యాక్షన్ ప్లాన్ లోకి దిగినట్లుగా ఉందన్న మాట కొందరు టీడీపీ సీనియర్ నేతల నోటి నుంచి రావటం గమనార్హం. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే.. ఈ రెండు పరిణామాలతో ఆగిపోదరి.. రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమంటున్నారు. ఓపక్క మాయదారి రోగం వణికిస్తుంటే.. మరోవైపు.. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో ఏపీ రాజకీయం హాట్ హాట్ గా మారటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.