Begin typing your search above and press return to search.

ఇప్పుడేం చేయాలి.. టీడీపీలో ఆందోళన

By:  Tupaki Desk   |   20 May 2019 4:44 AM GMT
ఇప్పుడేం చేయాలి.. టీడీపీలో ఆందోళన
X
ఒక్కటి మాత్రం స్పష్టమైంది. ఏపీ ప్రజలు చాలా తెలివైన తీర్పునిస్తున్నారని తేటతెల్లమైంది.. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి నానా యాగి చేసి అభూత కల్పనలతో కాలం గడిపిన చంద్రబాబు ఎన్నికల వేళ వరాల వాన కురిపించేసిరికి ఆ వరాల్లో ఆంధ్రా ప్రజలు తడిసి ముద్దవుతారని టీడీపీ నేతలు కలలుగన్నారు. పసుపు కుంకుమ - అన్నదాత సుఖీభవ సహా పథకాలతో తమకు ఓట్ల వాన పడుతుందని ఆశలు పెంచుకున్నారు. కానీ చాలా తెలివైన తీర్పునిచ్చిన ఏపీ ఓటర్లు టీడీపీని సాగనంపారు. ఎగ్జిట్ పోల్స్ వరదలా వచ్చిన వేళ ఏపీలో అధికార మార్పిడి ఖాయమన్న అంచనాలు బలపడుతున్నాయి.

అధికారం కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు - కుట్రలు అన్నీ ఇన్నీ కావని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించింది. ఎన్నికలకు నెల రోజుల ముందు పింఛన్లు పెంచడం.. పథకాల వాన కురిపించడం.. మోడీ-కేసీఆర్-జగన్ అంటూ విష ప్రచారం నిర్వహించారు. టీడీపీ అనుకూల మీడియా అయితే జగన్ మానస్థిక స్థైర్యాన్ని - వైసీపీని డిఫెన్స్ లో పడేసేలా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశాయి. ఒకనొక సమయంలో తెలంగాణలో కేసీఆర్ విసిరిన సంక్షేమ పథకాలతో అధికారంలోకి వచ్చినట్టు చంద్రబాబు కూడా వస్తారన్న అంచనాలు పెరిగిపోయాయి.

ఇక వైసీపీని దెబ్బకొట్టాలని రంగంలోకి ప్రజాశాంతి పార్టీ అంటూ కేఏపాల్ కూడా రంగంలోకి దిగారు. అచ్చం ఫ్యాన్ గుర్తును పోలిన హెలీక్యాప్టర్ గుర్తును సంపాదించి.. వైసీపీ అభ్యర్థులను పోలిన నేతలను పట్టుకొచ్చి మరీ వారి నియోజకవర్గాల్లో పోటీచేయించారు. కేఏపాల్ వెనుక చంద్రబాబు ఉన్నాడన్న విమర్శలు వచ్చాయి. అదే పాల్ ఇప్పుడు ఎన్నికల వేళ కనిపించకపోవడంతో ఇది పెద్ద కుట్ర అన్న సంగతి మనకు తేటతెల్లమవుతోంది.

కానీ తెలంగాణ ప్రజల కంటే తెలివిగా ఆంధ్రా ప్రజలు ఆలోచించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు కాకుండా అవసరార్థం ఓట్ల కోసం రాజకీయం చేసిన చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చారు ఆంధ్రా ఓటర్లు. తాత్కాలిక బాబు తాయిలాలకు కరుగమని గట్టి మెసేజ్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత నిజాయితీని - 3వేల కి.మీల పాదయాత్రను - సంకల్పానికి గులాం అయ్యారు.

వైసీపీ వస్తుందన్న క్లియర్ కట్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత టీడీపీలో నిజంగానే గుబులు మొదలైంది. ఇన్నాల్లు ప్రాజెక్టులు - వివిధ సంక్షేమ పథకాల పేరిట - రాజధాని అమరావతి పేరిట దోచుకున్న నేతల్లో ఇప్పుడు వణుకు మొదలైందన్న చర్చ జరుగుతోంది.. జగన్ వస్తే ఇవన్నీ తవ్వితీస్తాడని..తమ భవిష్యత్ ఏంటని ఇప్పుడు టీడీపీ నేతలు భయపడుతున్నారట..

జగన్ పార్టీ ఫిరాయింపులను అస్సలు ప్రోత్సహించే రకం కాదు.. వైసీపీ నుంచి పోయి తిరిగివచ్చిన వారికి ఈ దఫా టికెట్లు ఇవ్వలేదు. అలాగే టీడీపీ నుంచి వచ్చే వారిని అంత తేలిగ్గా బెండ్ అయ్యి రానిచ్చే రకం కాదు. దీంతో వైసీపీ గెలిచినా జంప్ చేద్దామన్న టీడీపీ నేతల ఆశలు తీరేలా కనిపించడం లేదు.. రాజీనామా చేసి వస్తేనే ఇతర పార్టీల నేతలను జగన్ తన పార్టీలోకి తీసుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు చేసిన పనులు, అవినీతి ని తవ్వితీసే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడ్డ మంత్రులు - ఎమ్మెల్యేల్లో ఇప్పుడు తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి,.

ఇక చంద్రబాబుకు ఇంత జ్ఞానోదయం అయినా ఇంకా ఎగ్జిట్ పోల్స్ నమ్మవద్దంటూ భరోసానిస్తున్నారు. ఓటమి కల్లముందు కదలాడుతున్నా దింపుడు కల్లం ఆశ చావని బాబు ఇంకా ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ఆగయా అన్న ఒకే ఒక్క పదంతో ఇటు చంద్రబాబు - అటు మంత్రులు - ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. ఇక ఫలితాలు వెలువడ్డాక టీడీపీ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి..