Begin typing your search above and press return to search.

రెండు రోజుల్లో చంద్ర‌బాబు టూర్‌.. రోడ్డున ప‌డికొట్టుకున్న టీడీపీ నేత‌లు

By:  Tupaki Desk   |   2 Nov 2022 5:30 PM GMT
రెండు రోజుల్లో చంద్ర‌బాబు టూర్‌.. రోడ్డున ప‌డికొట్టుకున్న టీడీపీ నేత‌లు
X
మ‌రో రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తారు. ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను ఆయన స‌మీక్షిస్తారు. ఇక్క‌డ పార్టీని ఎలా బ‌లోపేతం చేసుకోవాలో.. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో.. త‌మ్ముళ్లు ఎలా క‌లిసి మెలిసి ఉండాలో ప్ర‌భుత్వాన్ని ఎలా టార్గెట్ చేసుకోవాలో కూడా ఆయ‌న దిశానిర్దేశం చేయాల‌ని నిర్ణ‌యించారు. సో.. ఇది పార్టీ ప‌రంగా అత్యంత కీల‌క‌మైన కార్య‌క్ర‌మం. పైగా చంద్ర‌బాబే స్వ‌యంగా నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తున్న క్ష‌ణాలు. మ‌రి అలాంటి స‌మ‌యంలో త‌మ్ముళ్లు ఏంచేయాలి? పార్టీ ప‌రంగా అంద‌రూ బ‌లంగా ఉన్నామ‌ని.. చంద్ర‌బాబుకు భ‌రోసా ఇచ్చేలా వ్య‌వ‌హ‌రించాలి.

అంతేకాదు, చంద్ర‌బాబు వ‌స్తున్న నేప‌థ్యంలో అంగ‌రంగ వైభ‌వంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను విజ‌యవంతం చేసేందుకు ప్ర‌య‌త్నించాలి. కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రించ‌డం, స్థానికంగా ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? ఏయే స‌మ‌స్య‌లు ఉన్నాయి? వాటికి ప‌రిష్కారాలేంటి? టీడీపీ ప్ర‌భుత్వం వ‌స్తే ఏం చేద్దాం? ఇలా అనేక విష‌యాల‌పై వారంతా చ‌ర్చించి ఒక నోట్ త‌యారు చేసుకుని ప్ర‌జ‌ల మాట‌ను అధినేత‌కు వినిపించాలి. వివ‌రించే ప్ర‌య‌త్నం చేయాలి. ఇది క‌దా జ‌ర‌గాలి!

కానీ, అలా జ‌ర‌గలేదు. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ముంగిట త‌మ్ముళ్లు త‌న్నేసుకున్నారు. అలా ఇలా కాదు.. రోడ్డున ప‌డి మ‌రీ కొట్టుకున్నారు. ఇది ప్ర‌స్తుత ఎన్టీఆర్ జిల్లాలోని జ‌గ్గ‌య్య‌పేట‌లో జ‌రిగింది. ఇది టీడీపీకి అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వర్గం.

దీంతో చంద్ర‌బాబు ఈ నెల 4న‌ ఇక్క‌డకు వ‌చ్చి స‌మీక్షించాల‌ని నిర్ణ‌యించారు. అయితే, ఈయ‌న ప‌ర్య‌ట‌న‌కు రెండురోజుల ముందు విజయవాడ పార్లమెంటరీ పార్టీ టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టెం రఘురాం వర్గం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ వర్గం బాహాబాహీకి దిగింది.

టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శిపై శ్రీరామ్ రాజగోపాల్ వర్గానికి చెందిన 25వ వార్డు కౌన్సిలర్ భర్త దాడి చేశారు. దీంతో ఇరు వ‌ర్గాలు రోడ్డున ప‌డి కొట్టేసుకున్నాయి. క‌ర్ర‌లు, రాళ్ల‌తో ఇరు వ‌ర్గాలు ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు. దాడిపై రఘురాం వర్గానికి చెందిన సురేష్ జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.

కాగా... చంద్రబాబు పర్యటన ఖరారైన నేపథ్యంలో వర్గ విభేదాలతో నాయకులు, అనుచరులు కొట్టుకోవ‌డం పార్టీ ఎంత బ‌ల‌హీనంగా ఉందో అర్ధ‌మ‌వుతోంద‌ని సీనియ‌ర్లుగుస‌గుస‌లాడుతున్నారు. గ్రూపుల మధ్య అనైక్యతతో అధినేత కార్యక్రమం ఎలా ఉంటుందో అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.