Begin typing your search above and press return to search.

ఇంటింటికీ టీడీపీ.. నేత‌ల మ‌ధ్య మంట‌లు

By:  Tupaki Desk   |   29 Oct 2017 4:31 AM GMT
ఇంటింటికీ టీడీపీ.. నేత‌ల మ‌ధ్య మంట‌లు
X

టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్ర‌బాబు బృహ‌త్ ల‌క్ష్యంతో ప్రారంభించిన `ఇంటింటికీ టీడీపీ` కార్య‌క్ర‌మం.. అడుగ‌డుగునా అభాసు పాల‌వుతోంది! ఎక్క‌డిక్క‌డ తెలుగు త‌మ్ముళ్లు నేత‌ల మ‌ధ్య తీవ్ర వివాదాలు రోడ్డెక్కుతున్నాయి. ఇప్ప‌టి వ‌రకు నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న టీడీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు.. ఈ కార్య‌క్ర‌మం వేదిక‌గా బహిరంగం అయిపోతున్నాయి. ఫ‌లితంగా బాబు ఆశ‌యం - క‌ల క‌ట్ట‌గ‌ట్టి బుట్ట‌దాఖ‌ల‌వుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. 2019లోనూ అధికారంలోకి రావాల‌ని ఎన్నోక‌ల‌లు గంటున్న చంద్ర‌బాబు.. ఆదిశ‌గా చేయాల్సిన అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తున్నారు. తాను నిత్యం 16 నుంచి 18 గంట‌ల‌పాటు క‌ష్ట‌ప‌డుతున్నారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు.

ప్ర‌తి నెలా ఏదో ఒక సంక్షేమ ప‌థ‌కానికి శ్రీకారం చుడుతున్నారు. అదికారుల‌కు క్లాస్ ఇస్తున్నారు. ప‌నిచేయాల‌ని వెంట‌బ‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌కు త‌న ఇంపార్టెన్స్ గురించి ఎక్క‌డ అవ‌కాశం వ‌స్తే అక్క‌డ వివ‌రిస్తున్నారు. అయితే, మ‌రో ప‌క్క 2019లో అధికారం చేజిక్కించుకునేందుకు కాచుకుని కూర్చున్న విప‌క్షం వైసీపీ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌గానే.. బాబు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. తాను కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని డిసైడ్ అయ్యారు. అయితే, తాను ఒక్క‌డే కాకుండా పార్టీకి సంబంధించిన మందీ మార్బ‌లం మొత్తాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. దీంతో అధినేత ఆదేశానుసారం టీడీపీ నేత‌లు - మంత్రులు - ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతూ.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటార‌ని బాబు భావించారు.

అయితే, అనుకున్న‌ది ఒక్క‌టి. అయింది మ‌రొక్క‌టి. అన్న‌చందంగా మారింది ఈ కార్య‌క్ర‌మం! ఇంటింటికీ టీడీపీ కార్యక్ర‌మం చేప‌ట్టే క్ర‌మంలో నేత‌ల మ‌ధ్య విభేదాలు రోడ్డెక్కుతున్నాయి. మ‌రోప‌క్క‌, అభివృద్ధిపై ప్ర‌శ్నిస్తున్న ప్ర‌జ‌ల‌ను టీడీపీ మంత్రులు - ఎమ్మెల్యేలు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో కీల‌క‌మైన తాడికొండ మండటం బేజాత్పురంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడి ప్రయేయం లేకుండా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. దీంతో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతర కార్యకర్తలతో కార్యక్రమం నిర్వహించడంపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న జడ్పీ వైఎస్‌ చైర్మన్‌ వడ్లమూడి పూర్ణచంద్రరావు.. స్థానికేతరులు తక్షణం వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. గ్రామానికి చేరుకున్న అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కార్య‌క్ర‌మంపై నీలి నీడ‌లు అలుముకున్నాయి. ఏదో ఆశించి ఈ కార్య‌క్ర‌మం ప్రారంభిస్తే... మొత్తానికే మోసం వ‌చ్చేలా ఉంద‌ని టీడీపీ సీనియ‌ర్లు మీడియా వ‌ద్ద వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.