Begin typing your search above and press return to search.

తిట్ట‌టం త‌ర్వాత త‌మ్ముళ్లు.. క్లారిటీ ఇవ్వొచ్చుగా?

By:  Tupaki Desk   |   23 Aug 2018 6:31 AM GMT
తిట్ట‌టం త‌ర్వాత త‌మ్ముళ్లు.. క్లారిటీ ఇవ్వొచ్చుగా?
X
ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నోటి నుంచి వ‌చ్చిన ఆరో పెళ్లి మాట ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు దిమ్మ తిరిగే షాకిచ్చింద‌ని చెప్పాలి. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన ఆరో పెళ్లి మాట ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌ట‌మే కాదు.. అధికార‌ప‌క్షంపై ఏవ‌గింపు మొద‌లైంది. రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా చీల్చ‌ట‌మే కాదు.. ఈ రోజు ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌న్నింటికి కార‌ణం కాంగ్రెస్సేన‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే.

అలాంటి పార్టీతో పొత్తు దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌ట‌మే కాదు.. ఆ విష‌యంపై ఇప్ప‌టికే ఒక స్ప‌ష్ట‌త లోగుట్టుగా తెచ్చుకోవ‌టంపై ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రో.. ఆర్నెల్ల త‌ర్వాత వ్యూహాత్మ‌కంగా ప్ర‌జ‌ల మైండ్ సెట్ ను మార్చాల‌ని భావించిన బాబు ప్లాన్ బెడిసి కొట్ట‌ట‌మే కాదు.. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా చేశాయి జ‌గ‌న్ ఆరో పెళ్లి వ్యాఖ్య‌.

దీంతో.. పోయిన ప‌రువును తిరిగి తెచ్చుకోవ‌టం ఎలా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అంతేకాదు.. ఆరో పెళ్లిపై డ్యామేజ్ కంట్రోల్ కు ఏం చేయాల‌న్నది తెలుగు త‌మ్ముళ్ల‌కు ఇప్పుడో పెద్ద స‌మ‌స్య‌గా త‌యారైంది.

త‌మ భారీ స్కెచ్ ను సింఫుల్ గా ఆరో పెళ్లి పేరుతో గాలి తీసేసిన విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పై చంద్ర‌బాబు అండ్ కో కారాలు మిరియాలు నూరుతున్నారు. త‌మ ప‌థ‌కాన్ని దెబ్బ తీసిన జ‌గ‌న్ పై మాట‌ల దాడిని తీవ్ర‌త‌రం చేయాల‌న్న ప్లాన్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు.

అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా జ‌గ‌న్ మీద తిట్ల దండ‌కంతో విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించాల‌న్నది తెలుగు త‌మ్ముళ్ల ప్లాన్ గా తెలుస్తోంది. ఇందులో భాగంగా గ‌డిచిన రెండు రోజులుగా నోటికి వ‌చ్చిన‌ట్లుగా జ‌గ‌న్ పై మండిపాటు తెలుగు త‌మ్ముళ్ల మాట‌ల్లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆశ్చ‌ర్య‌క‌రంగా జ‌గ‌న్ పై దూష‌ణ‌ల‌కు దిగుతున్న వారెవ‌రూ కూడా ఆయ‌న ప్ర‌స్తావించిన ఆరో పెళ్లి మీద మాత్రం నోరు విప్ప‌టం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్నారా? లేదా? అన్న విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌టాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. జ‌గ‌న్ అన్న బాబు ఆరోపెళ్లి పై విరుచుకుప‌డ‌టం కాదు.. ద‌మ్ముంటే కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా? లేదా? అన్న విష‌యంపై సూటిగా.. స్ప‌ష్టంగా చెప్పేస్తారా? అన్న ప్ర‌శ్న‌కు త‌మ్ముళ్ల నోట మాట రాని ప‌రిస్థితి.