Begin typing your search above and press return to search.

జగన్‌ పత్రిక వంటకాలపై మండిపడుతున్న తమ్ముళ్లు

By:  Tupaki Desk   |   11 Jun 2015 9:35 AM GMT
జగన్‌ పత్రిక వంటకాలపై మండిపడుతున్న తమ్ముళ్లు
X
అవకాశం చిక్కినప్పుడు ఎంతలా చెలరేగిపోవాలో జగన్‌ పత్రికను చూస్తే తమకు అర్థమవుతుందని వాపోతున్నారు తెలుగుతమ్ముళ్లు. ఓటుకు నోటు వ్యవహారంలో జగన్‌ పత్రిక అనుసరిస్తున్న వైఖరిపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఆ పత్రికలో వస్తున్న కథనాలు.. రాతల్లోని దూకుడు చూసి వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారం కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును జత చేస్తారా? ఆయనకు నోటీసులు ఇస్తారా? అన్న విషయంపై స్పష్టత రాకముందే.. నోటీసులు ఇచ్చేసి.. ఆయన్ను విచారణకు ఆదేశిస్తే.. బాబు తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందన్న వరకూ వెళ్లటంలో పెద్ద ఇబ్బంది లేనప్పటికీ.. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు పట్టుకునేందుకు బాలకృష్ణ.. లోకేశ్‌లు రెఢీ అవుతున్నారంటూ వండుతున్న వార్తల్ని చూసి చిరాకు పడిపోతున్నారు.

అదే సమయంలో తమిళనాడు రాజకీయాల పోలిక తీసుకొచ్చి.. బాబు తనకు అత్యంత విధేయుడైన వ్యక్తులను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొబెట్టి తాను చక్రం తిప్పుతారనే ఊహాగానాల్ని చేయటమే కాదు.. అలాంటి విధేయుల్లో చినరాజప్ప.. నారయణ పేర్లతో పాటు.. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పేర్లు వినిపించటం కాస్తంత విచిత్రమైన విషయంగా చెబుతున్నారు.

జయలలితకు వారసులు లేరు. కానీ.. చంద్రబాబునాయుడికి కొడుకు లోకేశ్‌.. వియ్యంకుడు బాలకృష్ణ ఉన్నారు. ఇద్దరు కాదని.. ఎవరినో బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏమిటంటూ తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు. అసలు విషయం అంతవరకూ వెళ్లదని.. అయినప్పటికీ జగన్‌ పత్రికలో వంటకాలు మరీ శృతి మించుతున్నాయన్న ఆగ్రహాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. టైం బాగోలేనప్పుడు.. ఇలానే చెలరేగిపోతారంటూ కొందరు తమ్ముళ్లు సర్ది చెప్పటం కనిపిస్తోంది.