Begin typing your search above and press return to search.

ఫ్యామిలీని తమ్ముళ్లు ఎంతగా తిట్టేశారంటే..

By:  Tupaki Desk   |   2 Oct 2015 4:11 AM GMT
ఫ్యామిలీని తమ్ముళ్లు ఎంతగా తిట్టేశారంటే..
X
తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన ఉత్సాహమో.. మరింకేదైనా కారణమో కానీ.. తెలంగాణ తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో చెలరేగిపోయారు. తెలంగాణ అధికారపక్షంగా కొద్ది మంది తమ్ముళ్లు మాత్రమే తిట్టేస్తారన్న మాటకు భిన్నంగా.. టీటీడీపీ నేతలు పలువురు కలిసి తెలంగాణ అధికారపక్షంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీని ఏకిపారేశారు.టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి.. ఎల్ రమణ.. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్.. బండ్రు శోభారాణి మాట్లాడారు.

టీడీపీని దొంగల పార్టీగా కేసీఆర్ కుమార్తె.. టీఆర్ ఎస్ ఎంపీ అయిన కవిత చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. ‘‘టీడీపీ అంటే దొంగల పార్టీ అన్న కవిత.. మీ నాన్న కేసీఆర్ టీడీపీలో 17 ఏళ్లు పని చేసినప్పుడు కూడా దొంగల పార్టీయేనా? మీ నాన్న బయలకు రాగానే ఇది మారిపోయిందా? కవిత సమాధానం చెప్పాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.

టీఆర్ ఎస్ పార్టీ చేపట్టి ఆపరేషన్ అకర్ష్ తో పార్టీలోని దొంగలంతా అధికారపక్షంలోకి వెళ్లిపోయారని.. టీడీపీ ప్రక్షాళన అయిపోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేసీఆర్ పితామహుడేం కాదని.. 1969 నుంచి 2014 వరకూ ఎంతోమంది తెలంగాణ కోసం బలిదానాలు చేశారని.. ఆ విషయాన్ని మర్చిపోకూడదన్నారు. తెలుగుదేశం పార్టీని విమర్శించేందుకు ముఖ్యమంత్రి కుమార్తె కవిత వాడుతున్న భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని.. ఆమె భాష అమెరికాలో చదువుకున్నట్లు లేదని విమర్శించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ను ‘‘తెలంగాణలో అందరికి తెలిసిన దొంగ’’గా అభివర్ణించారు. కవిత తన భాషను మార్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ కు డ్రెస్సు.. అడ్రెస్సు ఇచ్చింది టీడీపీనేనన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. బషీర్ బాగ్ కాల్పుల గురించి ప్రస్తావిస్తున్నారని.. మరి.. ఈ విషయం తెలిసి మరీ 2009లో తమతో చేతులు కలిపి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని సూటిగా ప్రశ్నించారు.

తెలంగాణలో మరణించిన రైతుల్ని పరామర్శించాలన్న కనీస ఇంగితం కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి లేదని.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి.. తెలంగాణ రౌడీల సమితిగా అభివర్ణించారు. బతుకమ్మ పేరుతో బహుమతులు వసూలు చేసే ఎంపీ కవితకు టీడీపీని విమర్శించే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. మొత్తమ్మీదా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమార్తె కవితపై తెలుగు తమ్ముళ్లు దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది.