Begin typing your search above and press return to search.

సీనియర్లతో మాట్లాడని అభ్యర్ధి ?

By:  Tupaki Desk   |   23 March 2021 4:30 PM GMT
సీనియర్లతో మాట్లాడని అభ్యర్ధి ?
X
తెలుగుదేశంపార్టీలో పరిస్దితి చాలా విచిత్రంగా ఉంది. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేస్తుందని చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు మాసాల క్రితమే చంద్రబాబు అభ్యర్ధిని ప్రకటించినా ఆమె ఇంతవరకు ప్రచారంలోకి దిగలేదు. మొదట్లో కూతురు వివాహమని, అంతకుముందు దానికి సంబంధించిన ఏర్పాట్లని ఆమె చెప్పారు.

జనవరిలో వివాహం అయిపోయింది. ఇపుడు చెప్పటానికి కూడా ఏమీలేదు. అయినా పనబాక ప్రచారంలోకి దిగలేదు. పోనీ ఇంతకాలం ఏదో పనుల్లో ఉందని అనుకున్నా నాలుగు రోజుల క్రితం పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు పనబాక కార్యక్రమాన్ని ప్రకటించారు. తమ అధినేత ప్రకటించిన తర్వాతైనా పనబాక ప్రచారంలోకి దిగలేదు. ఇదే విషయాన్ని పార్టీలోని కొందరు సీనియర్లతో మాట్లాడితే అసలు తమతో అభ్యర్ధి ఇంతవరకు మాట్లాడలేదని చెప్పారు.

ఒకవైపు అధికార వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి ప్రచారంలోకి దిగేశారు. ఈయనకు మద్దతుగా మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతల్లో కొందరు ప్రచారం మొదలుపెట్టేశారు. అధికారపార్టీయే అభ్యర్ధితో ప్రచారానికి దిగినపుడు ప్రతిపక్ష అభ్యర్ధి మాత్రం ఇంకా ఎందుకని ప్రచారంలోకి దిగలేదో పార్టీ నేతలకు అర్ధం కావటంలేదు. మొదటినుండి ఈమెకు పోటీ చేయటం ఇష్టం లేదనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది.

దానికి తగ్గట్లే ఆమె అప్పెడెప్పుడో నేతలతో ఒకసారి మాట్లాడుతు తాను బిజీగా ఉన్న కారణంగా తన తరపున ప్రచారం చేయాలని చెప్పారు. అభ్యర్ధే బిజీగా ఉన్నపుడు తాము చేసే ప్రచారం ఏముంటుంది ? అన్న పద్దతిలో ఎవరు ప్రచారంలోకి దిగలేదు. మరిపుడు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా అభ్యర్ధి+నేతలు ఎందుకని ప్రచారంలోకి దిగలేదు ? అన్నది కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు పోటీ చేస్తారా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు కొందరు నేతలు పనబాకతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదట. దాంతో పనబాక సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.