Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ కు కొత్త అనుభ‌వం రుచి చూపిస్తున్న టీడీపీ

By:  Tupaki Desk   |   20 March 2018 5:45 PM GMT
ప‌వ‌న్‌ కు కొత్త అనుభ‌వం రుచి చూపిస్తున్న టీడీపీ
X
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు రాజ‌కీయం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ రుచి చూపిస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌చారానికి కేరాఫ్ అడ్రస్‌..త‌మ‌తో క‌లిసి ఉంటే గొప్ప‌వాళ్లు - నిష్క‌ల్మ‌షులు - అదే తేడా వస్తే...ప్ర‌పంచం మొత్తంలో అలాంటి వ్య‌క్తే లేర‌న్న‌ట్లుగా ప్ర‌చారం చేసే తెలుగు త‌మ్ముళ్లు ఇప్పుడు అదే ప్ర‌చారాన్ని ప‌వ‌న్ విష‌యంలోనూ అవ‌లంభిస్తున్నార‌ని జ‌న‌సేనాని అభిమానులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు తాజాగా చేస్తున్న విమ‌ర్శ‌ల తీరు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు. ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మొద‌లుకొని ఆయ‌న త‌న‌యుడైన రాష్ట్ర మంత్రి లోకేష్ స‌హా మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - పార్టీ నాయ‌కులు మండిప‌డం...దాదాపుగా ప‌దిమందికి పైగా మంత్రులు - భారీ సంఖ్య‌లో టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం చిత్రంగా ఉందంటున్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వంలో కొన‌సాగుతున్న భారీ అవినీతి - ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌య‌త్నలోపం స‌హా ఇత‌ర‌త్రా అంశాల‌పై ప‌వ‌న్ సూటిగా ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు - ఆయ‌న త‌న‌యుడు లోకేష్ అవినీతి గురించి ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. దీంతో త‌మ నాయ‌కులను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు - పార్టీ వాద‌న‌ను వినిపించేందుకు టీడీపీ నేత‌లు పొలోమంటూ విమ‌ర్శ‌లు చేశార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు అంటున్నాయి.

త‌న‌పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ పవన్ నిరాధార ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని అంటూనే ఆయన దుమ్మెత్తిపోస్తే నేనే దులుపుకోవాలా? అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఆధారాలుంటే ఒక్కరోజులేనే ఎలా మాటమార్చారని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలపై నేరుగా నాకే ఫోన్ చేసి అడగొచ్చుకదా? అని అభిప్రాయపడ్డారు.

ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ పోలవరంలో జరిగిన అవినీతి ఏంటో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అవినీతి ఆరోపణలను ఆధారాలతో గాని రుజువు చేస్తే చర్యలు తీసుకునే ధైర్యమున్న ప్రభుత్వం తమదని ఆయన వివరించారు. తెదేపాపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇమేజ్ నాశనమైందని తెలిపారు. పవన్ మాట మారుస్తున్నారని, రాష్ట్రానికి ఏమైనా చేయదలుచుకుంటే ఢిల్లీకి వెళ్లి చేయాలని సూచించారు. హోదా పైనా మాట మారుస్తున్నారని.. అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్.. ఢిల్లీకి పోకుండా ఇక్కడే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. మంత్రి నారాయ‌ణ మాట్లాడుతూ ప్రజల్లో పవన్ కల్యాణ్ విశ్వాసం కోల్పోయారని తెలిపారు. నారా లోకేశ్ పై నిరాధార ఆరోపణలు చేసిన పవన్, లోకేశ్ గురించి తనకు ఎవరో చెప్పారని.. తనకు కల వచ్చిందని అంటున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడుతుంటే పవన్ కల్యాణ్ విజయవాడలో కూర్చున్నారని విమర్శించారు. వీరితో పాటుగా పార్టీ ఫిరాయించి మంత్రులు అయిన సుజ‌య్ కృష్ణ‌రంగారావు, ఆదినారాయ‌ణ రెడ్డి సైతం ప‌వ‌న్‌పై స్పందించారు.

ఇక ఎమ్మెల్యేలు - పార్టీ అధికార ప్ర‌తినిధులు - టీవీ డిబేట్ల‌లో పాల్గొన్న వారి జాబితా కూడా చాంతాడంత ఉంద‌నే అంటున్నారు. మొత్తంగా త‌మ నాయ‌కుడిపై విమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా ఇటు పార్టీ పెద్ద‌ల దృష్టిలో ప‌డటం అటు ప్ర‌జ‌ల‌కు త‌మ గ‌ళం వినిపించ‌డం అనే ల‌క్ష్యాల‌ను టీడీపీ నెర‌వేర్చుకుందంటున్నారు. ప‌వ‌న్‌కు కొత్త రాజ‌కీయం రుచి చూపించార‌ని, టీడీపీ మార్క్ రాజ‌కీయం ఏంటో తెలియజెప్పార‌ని విశ్లేషిస్తున్నారు.