Begin typing your search above and press return to search.

ఆ ఎస్సైపై కస్సుమంటున్న పచ్చదళం!

By:  Tupaki Desk   |   3 Jan 2018 5:28 AM GMT
ఆ ఎస్సైపై కస్సుమంటున్న పచ్చదళం!
X
‘‘ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తూ ఉంటే.. తమ చెప్పు చేతల్లో ఉండవలసిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం.. సదరు పాదయాత్రను నీరుగార్చడానికి విఫలం అయ్యేలా చేయడానికి తమ వంతుగా కృషి చేయాలి. ఆ పని చేయడం చేతకాకపోతే.. ఏదో రకంగా ఆ పాదయాత్రకు ప్రజాస్పందన వెల్లువెత్తకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్ప.. ఆ పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నట్టుగా, అందులో ఉన్న స్ఫూర్తిని ప్రశంసిస్తున్నట్లుగా, వారికి మద్దతు ఇస్తున్నట్లుగా వ్యవహరిస్తే ఎలా? తమకు ఎంత అపర్దిష్ట.. నామర్దా...’’ అని చిత్తూరు జిల్లాలోని తెలుగుదేశం నాయకులు ఇప్పుడు తమలో తాము మధన పడిపోతున్నారు.

ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న పాదయాత్ర ప్రస్తుతం.. చిత్తూరు జిల్లాలో సాగుతోంది. బుధవారం నాడు వాల్మీకి పురం ప్రాంతంలో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. జగన్ పాదయాత్ర కు సహజంగానే ప్రజాస్పందన వెల్లువెత్తుతోంది. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయినప్పటికీ.. మరో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిధిలోని నియోజకవర్గమే అయినప్పటికీ.. అక్కడ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జన స్పందన ప్రతి చోటా కనిపిస్తున్నదే కాగా, ఇక్కడ పోలీసు ఎస్సై కూడా వైఎస్ జగన్ తో కలిసి కాసేపు పాదయాత్రలో పాల్గొనడం - ప్రతిపక్ష నేత పట్ల సానుకూలంగా వ్యవహరించడం.. ఆయనను వ్యక్తిగతంగా కలిసి అభిమానంగా మాట్లాడడం ఇవన్నీ తెలుగుదేశం నాయకులకు మింగుడు పడలేదు.

జగన్ పాదయాత్రకు భద్రత కల్పించేందుకు విధినిర్వహణలో భాగంగా రొంపిచెర్ల ఎస్ ఐ నాగార్జున రెడ్డి అక్కడకు వచ్చారు. స్వతహాగా అనంతపురం జిల్లాకు చెందిన నాగార్జున రెడ్డి కడప జిల్లాకు అల్లుడు. ఆయన జగన్ తో కాసేపు ముచ్చటించి.. ఆయనతోపాటూ పాదయాత్రలో కొంత దూరం నడిచారు. ఏదో భద్రత ఏర్పాట్ల నిమిత్తం ఆయన వెంట వెళుతున్నట్లుగా కాకుండా.. జగన్ చేతిలో చేయి వేసి పట్టుకుని.. పార్టీ అనుచరులు ఉత్సాహంగా పాల్గొనే రేంజిలో ఎస్సై నాగార్జున రెడ్డి జగన్ తో కలిసి నడిచారు. పాదయాత్రకు సంఘీభావం లాగా ప్రభుత్వాధికారి స్పందిస్తుండే సరికి.. పార్టీ నాయకులు కూడా తొలుత నివ్వెరపోయినా.. మంచి పనికి ఎవరి స్పందనైనా ఇలాగే ఉంటుందని అనుకున్నారు. అయితే.. ఈ ఎస్సై తీరు చూసి.. తెలుగుదేశం నాయకులకు మాత్రం కన్ను కుట్టింది. ఎస్సై తీరుపై వారు అప్పుడే పోలీసు ఉన్నతాధికార్లకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వం పరువు పోయేలా.. ప్రతిపక్షనేత పాదయాత్రకు సంఘీభావం లాగా వ్యవహరించినందుకు ఎస్సై మీద చర్య తీసుకోవాల్సిందేనని.. పచ్చ దళాలు కస్సుబుస్సుమంటున్నట్లుగా తెలుస్తోంది.