Begin typing your search above and press return to search.

మినీ మహానాడులో పిడిగుద్దుల వర్షం

By:  Tupaki Desk   |   21 May 2016 10:50 AM GMT
మినీ మహానాడులో పిడిగుద్దుల వర్షం
X
ఏపీలో రోజురోజుకీ బలపడుతున్న టీడీపీలో విభేదాలు అంతేస్థాయిలో ముదురుతున్నాయి. కొన్ని చోట్ల అంతర్గత విభేదాలు ఉంటుండడగా కొన్ని జిల్లాల్లో ఏకంగా బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో జ‌రుగుతోన్న మినీ మ‌హానాడులో తెలుగుదేశం నేతల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రకాశం జిల్లాలో సుదీర్ఘ కాలంగా శత్రువులుగా కొనసాగుతున్న కరణం బలరాం - గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య మినీ మహానాడు వేదికగా నినాదాలతో ప్రారంభమైన ఘర్షణ - వాగ్వాదంగా మారి తోపులాటకు దారితీసింది. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం - గొట్టిపాటి రవి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎప్పటినుంచో వారి మధ్య విభేదాలున్నాయి. తాజాగా మినీ మహానాడు వేదికపైకి గొట్టిపాటి రవి వర్గాన్ని రాకుండా చేయాలని బలరాం వర్గం ప్రయత్నించింది. బలరాం కూడా వారు వేదికపై రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల నేతల అరుపుపులు కేకలతో మినీ మహానాడు ప్రాంగణం దద్దరిల్లిపోయింది. దీంతో అక్కడున్న మంత్రి రావెల కిశోర్ బాబు - పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దాంతో కొంత సద్దుమణిగింది. అనంతరం కరణం బలరాం ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినా కూడా గొట్టిపాటి వర్గీయులు సంయమనం పాటించారు. కానీ, ఆ తరువాత గొట్టిపాటి రవికుమార్ సభికులనుద్దేశించి మాట్లాడే సమయంలో కరణం బలరాం వర్గీయులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారికి దీటుగా గొట్టిపాటి రవి వర్గీయులు కరణం బలరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ పెరిగింది. ఓ ద‌శ‌లో ఒక‌రిపై ఒర‌కు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు రెండు వర్గాల వారిని అడ్డుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

చిరకాలంగా ఉన్న వైరానికి తోడు తాజాగా ఘర్షణలు తలెత్తడంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా సాక్షాత్తు మంత్రి - సీనియర్ నేతల ముందే ఇద్దరు నేతలు ఘర్షణకు దిగడం.. తమ అనుచరులను వారించకపోవడం వంటివి చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. రాయలసీమ నేతల మధ్య కొట్లాటలతో ఇప్పటికే తలనొప్పి భరిస్తున్న చంద్రబాబు ప్రకాశం జిల్లా విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని... ఇద్దరిని పిలిచి మాట్లాడాలని నిర్ణయించారని తెలుస్తోంది.