Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్లు దోచేస్తున్నారు.. క‌నిపించ‌దా బాబూ!

By:  Tupaki Desk   |   4 Oct 2017 4:47 AM GMT
త‌మ్ముళ్లు దోచేస్తున్నారు.. క‌నిపించ‌దా బాబూ!
X
అవును! టీడీపీ ఎమ్మెల్యేలు - దిగువ‌స్థాయి త‌మ్ముళ్లు కుమ్మ‌క్క‌యి పోయారు. భూ సేక‌ర‌ణ పేరుతో ప్ర‌జాధ‌నాన్ని ఆబ‌గా భోంచేసేస్తున్నారు. అయినా అడిగేవారు లేక‌పోగా.. అధికారులు కూడా ``దొరికిందిరా సందు`` అంటూ త‌మ్ముళ్ల‌తో క‌లిసి పంచేసుకుంటున్నారు. వీరికి ఇప్పుడు పోల‌వ‌రం ముంపు మండ‌లాలు మాబా(బు)గా క‌లిసొచ్చాయి. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో నిర్మిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని మండ‌లాల‌ను ప్ర‌భుత్వం ముంపు మండ‌లాలుగా ప్ర‌క‌టించింది. దీంతో ఈ మండ‌లాల్లోని ప్ర‌జ‌ల‌కు వేరే చోట స్థ‌లాలు కేటాయించేందుకు మ‌రో చోట భూసేక‌ర‌ణ చేప‌ట్టింది.

ఈ ప‌రిణామ‌మే టీడీపీ ఎమ్మెల్యేల‌కు త‌మ్ముళ్ల‌కు బాగా క‌లిసొచ్చింది. ప‌శ్చిమ‌గోదావ‌రిలోని బుట్టాయగూడెం మండలం దొరమామిడిలో సేకరించిన భూమి విషయంలో అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పారని, వీరికి అధికారులు ఊతం ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురయ్యే వేలేరుపాడు - కుక్కునూరు మండలాల నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం మండలం దొరమామడి గ్రామంలో ప్రభుత్వం భూసేకరణ చేసింది. ఈ భూసేకరణ అధికార పార్టీకి చెందిన నేతలకు కల్పతరువుగా మారింది.

టీడీపీ కి చెందిన వారైతే ఒక రకంగా - కాని వారికి మరో రకంగా పరిహారం ఇప్పిస్తూ.. క‌మీష‌న్లు కొట్టేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే - నేత‌లు. అంతేకాదు.. తమ వారైతే లేని పంటలు ఉన్నట్లుగా చూపించి అప్పనంగా ప్ర‌జా ధ‌నాన్ని దోచేస్తున్నారు. భూ సేకరణలో భూములతో పాటు మొక్కలు - చెట్లు - షెడ్‌ లు ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేయించారు. వీరికి కొంద‌రు అధికారులు చేతులు క‌లిపేశారు. దీంతో విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా ప‌ని కానిచ్చేశారు. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీకి చెందిన వారి భూములకు ఏ గ్రేడ్‌ మొక్కలకు ఇచ్చే రేట్లు ఇవ్వగా, ఇతరులకు నామమాత్రంగా చెల్లింపులు జరిగాయి.

ఎక్కువగా బుట్టాయగూడెం మండలంలోని దొరమామిడి - కోటనాగవరం భూముల‌ను అడ్డు పెట్టుకుని నేత‌లు దోచేశార‌ని సమాచారం.ఒక్క దొరమామిడి ప్రాంతంలో 8 ఎకరాల చెరువు - పోరంబోకు భూమిని కూడా భూ సేకరణలో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసేసుకున్నారు. టేకు - వేప - తాడి - బూరుగ చెట్లతో పాటు లేని జామాయిల్‌ మొక్కలు కూడా ఉన్నట్లు రాసి సొమ్ములు కుమ్మేశారు. అడవిలోనే అంతగా కనిపించని వెదురు పంటను దొరమామిడిలోని ఒక రైతు పొలంలో 9,250 వెదురు గెడలు ఉన్నట్లు రికార్డుల్లో రాయించేశారు.

ఈ ప్రాంతంలో నిర్వాసితుల కోసం సేకరించిన 774 ఎకరాల భూమి నిర్వాసితులకే కౌలుకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతంలోని కొందరు కౌలు సొమ్ముగా ఇప్పటికే రూ.7.77 లక్షలు చెల్లించారు. భూ సేకరణే లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు నిర్వాసితుల సమస్యలపై సరైన శ్రద్ధ చూపలేదు. ఇప్పటికైనా ఈ భూసేకరణపై పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని బాధితులు చెబుతున్నారు. మ‌రి ప‌ట్టించుకునే నాధుడు ఎవ‌రు? త‌మ్ముళ్లు రెచ్చిపోతుంటే.. బాబు ఎందుకు మౌనం దాలుస్తున్నారో ఆయ‌న‌కే తెలియాలి!