Begin typing your search above and press return to search.

ఆంధ్రాబ్యాంక్ కు ఈ పరిస్థితి..కారణం టీడీపీనేనా?

By:  Tupaki Desk   |   4 Sep 2019 6:20 AM GMT
ఆంధ్రాబ్యాంక్ కు ఈ పరిస్థితి..కారణం టీడీపీనేనా?
X
ఒక వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రాబ్యాంకు విలీనం వద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాసినట్టుగా ప్రకటించుకున్నారు. ఆ లేఖలో నిర్మలను చంద్రబాబు నాయుడు తీవ్రంగానే కీర్తించారు! ఆమె ఆర్థికమంత్రిగా అద్భుతంగా రాణిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అయితే ఆంధ్రా బ్యాంకు విలీనం మాత్రం వద్దంటూ చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా తెలుగుదేశం పార్టీ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

మరి ఆంధ్రా బ్యాంకుకు ఈ పరిస్థితి రావడానికి కారణం మాత్రం పరోక్షంగా తెలుగుదేశం పార్టీనే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ఆంధ్రాబ్యాంకుకు వేసిన టోకరాల ఫలితంగానే అది బాగా నష్టపోయిందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.

ఆంధ్రా బ్యాంకుకు టోకరా వేసిన వాళ్లలో తెలుగుదేశం పార్టీ నేత రాయపాటి ముందున్నారు. ఆయన ఏకంగా ఏడువందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులను తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలున్నాయి. ఆ అప్పులను తీసుకుని రాయపాటి తన ఆస్తులను పెంచుకున్నారని - బ్యాంకును మాత్రం ముంచేశారనే వార్తలు వచ్చాయి.

ఆంధ్రాబ్యాంకు మొండి బకాయీల్లో తెలుగుదేశం పార్టీ నేతల పేర్లే ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి బ్యాంకును నిండా ముంచింది వీళ్లే - ఇప్పుడు సెంటిమెంట్ ను వాడుకుంటున్నదీ ఈ నేతలే కావడం గమనార్హం. ఆంధ్రాబ్యాంక్ పై చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. తమ పార్టీ నేతలతో అప్పులను తిరిగి చెల్లింపజేస్తే బాగుంటుందని పరిశీలకు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.