Begin typing your search above and press return to search.

లోకేశ్ ను బలి పశువును చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   5 Dec 2015 7:30 AM GMT
లోకేశ్ ను బలి పశువును చేస్తున్నారా?
X
తెలంగాణలో ఎదురే లేకుండా పోతున్న టీఆరెస్ కు హైదరాబాద్ లో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలుపు అంత సులభం కాదని మొన్నమొన్నటి వరకు అంతా భావించారు. ఇటీవల వరంగల్ ఉప ఎన్నికల్లోనూ అలాంటి అంచనాలే వేశారు. టీఆరెస్ గెలుస్తుంది కానీ మెజారిటీ సగానికి పడిపోతుందని అనుకున్నారు. కానీ, అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మెజారిటీతో రికార్డు సృష్టించారు. దీంతో ఇప్పుడు జీహెచ్ ఎంసీ ఎన్నికల విషయంలో అంతకుముందులా టీఆరెస్ ను ఎవరూ తేలిగ్గా తీసుకోవడం లేదు. అందులోనూ తెలంగాణ టీడీపీ నాయకులైతే మరీ భయపడుతున్నారు. హైదరాబాదులో తమకు ఇంకా పట్టుందని, కొంతవరకు నెట్టుకురాగలమని ఇంతకాలం అనుకున్న టీడీపీ నాయకులు ఇప్పుడు లోలోన టెన్షన్ పడుతున్నారు. అంతేకాదు, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ టీఆరెస్ దూసుకెళ్లడం ఖాయమని... తాజాగా కంటోన్మెంటు ఎమ్మెల్యే సాయన్న కూడా టీఆరెస్ లో చేరడంతో టీడీపీ బలం మరింత తగ్గిందని.. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతే తమను అధినేత చంద్రబాబు నానా చీవాట్లు పెడతారని తెలంగాణ టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆ క్రమంలోనే వారు ఆ బాధ్యత ఏదో చంద్రబాబు తనయుడు లోకేశ్ భుజాన్నే వేస్తే గెలిచినా ఓడినా ఆయన ఖాతాలో పడుతుందని.. తాము సేఫ్ గా ఉండొచ్చని అనుకుంటున్నాట్లు సమాచారం.

సాయన్న కారెక్కిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై చర్చించేందుకు లోకేశ్ తో తెలంగాణ టీడీపీ నేతలు మంతనాలు జరిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా టీటీడీపీ నేతలంతా తమ తెలివితేటలు ప్రదర్శించారు. పార్టీ కోలుకోవడానికి మార్గాలు చెప్పకుండా లోకేశ్ బాబూ నీవే శరణ్యం అన్నారు. ఎర్రబెల్లి - రేవంత్ - ఎల్.రమణ సహా పలువురు టీడీపీ ముఖ్యనేతలు హాజరైన ఈ సమావేశంలో నాయకులంతా లోకేశ్ ను గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారట. గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కోవాలన్నా… కేసీఆర్ స్పీడుకు తగ్గట్లుగా వ్యూహాలు వేయాలన్నా మీవల్లే అవుతుందని.. మీలాంటి యువనేతే ఇక్కడ అవసరం అంటూ లోకేశ్ ను బుట్టలో వేసినట్లు తెలుస్తోంది. లోకేశ్ ఆ దెబ్బకు కాస్త మెత్తబడినా నిర్ణయం తన ఒక్కడిదే కాదని.. చంద్రబాబుతో సమావేశమై నిర్ణయిస్తానని అన్నారట. ఈ లెక్కన టీటీడీపీ నేతల ప్లాను వర్కవుటయ్యేలాగే ఉంది.