Begin typing your search above and press return to search.

బాబుకు మెడ‌కు చుట్టుకుంటున్న పార్టీ లీకులు

By:  Tupaki Desk   |   22 Feb 2017 12:30 AM GMT
బాబుకు మెడ‌కు చుట్టుకుంటున్న పార్టీ లీకులు
X
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అంటేనే పని కంటే ప్ర‌చారానికి ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తార‌నే టాక్ ఉంది. అదే స‌మ‌యంలో కొన్ని విష‌యాల‌ను నేరుగా చెప్ప‌కుండా లీకుల రూపంలో ఆయ‌న చేర‌వేస్తుంటారు. అలా ఇచ్చిన లీకులే బాబు మెడ‌కు చుట్టుకున్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో పార్టీ మారి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరికి మంత్రిపదవి వస్తోందంటూ పార్టీ ద్వారా జరుగుతున్న విస్తృత ప్రచారం తమ్ముళ్లను క‌ల‌వ‌ర‌పెట్టి ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసీపీ వైపు చూసేలా ప్రేరేపిస్తున్నాయి. దీంతో టీడీపీ నేత‌లు బుజ్జ‌గించాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కర్నూలు జిల్లా నుంచి భూమా నాగిరెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, అనంతపురం నుంచి చాంద్‌పాషా, విజయనగరం నుంచి సుజయకృష్ణ రంగారావుకు పదవులు లభిస్తాయంటూ మొదలైన ప్రచారం టీడీపీ సీనియర్లలో కలకలం రేకెత్తిస్తోంది. మొదటినుంచి పనిచేస్తున్న వారిని పక్కకుపెట్టి, కేవలం జగన్ పార్టీని నిర్వీర్యం చేయాలన్న వ్యూహంలో భాగంగా, ఆ పార్టీవారిని చేర్చుకుని పెద్దపీట వేస్తున్న వైనం టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో అసంతృప్తులు తారాస్థాయికి చేరాయ‌ని స‌మాచారం.

జంప్ జిలానీల‌కు శ్రీ‌కారం చుట్టిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి వస్తోందంటూ మొదలైన ప్రచారం ఆయన ప్రత్యర్థులైన శిల్పా బ్రదర్స్, ఇరిగెల రాంపుల్లారెడ్డి తదితర నేతల్లో అలజడి రేపుతోంది. ఇప్పటికే గంగుల పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ముగ్గురు సీనియర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నప్పటికీ అధికారం ఉన్నందున తమ మాటకు విలువ ఉంటుందన్న భావనతో, ఇప్పటివరకూ పార్టీలో కొనసాగుతున్న వారికి, భూమా మంత్రి అవుతున్నారన్న ప్రచారం మింగుడుపడటం లేదు. వీరంతా ఉప ముఖ్యమంత్రి కేఈని కలిసి తమకు జరుగుతున్న అవమానంపై వాపోయినట్లు తెలిసింది. శిల్పా బ్రదర్స్ ఇటీవల బాబును కలసి తమ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ విషయం తెలిసి శిల్పా బ్రదర్స్‌ను బుజ్జగించేందుకు చంద్రబాబు పార్టీ నేతలను రాయబారానికి పంపినా, వారు అసంతృప్తి వీడటం లేదని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్‌కు మంత్రి పదవి వస్తోందంటూ జరుగుతున్న ప్రచారం జిల్లాల్లోని టిడిపి సీనియర్ల ఆగ్రహానికి కారణమయింది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే తమ దారి తాము చూసుకునేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో ఒకరంటే మరొకరికి పొసగని నేతలంతా ఏకమవుతుండటం విశేషం. జనార్దన్ వంటి సీనియర్ ఉండగా, కొత్తగా పార్టీలోకి వచ్చిన గొట్టిపాటికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కరణం బలరాం వర్గం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ గొట్టిపాటికి మంత్రి పదవి ఇస్తే ప్రకాశం జిల్లాలో తిరుగుబాట్లు తప్పేలా లేవు. వైసీపీ బలపడుతున్న జిల్లాల్లో ప్రకాశం ఒకటి కావడంతో రాగల పరిణామాలపై నాయకత్వం కూడా ఆందోళనతో ఉంది.

విజయనగరం జిల్లాలో తమను కాదని సుజయకృష్ణ రంగారావుకు ఎలా మంత్రి పదవి ఇస్తారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. వెలమ సామాజికవర్గానికి రాష్ట్రంలో ఎంత బలం ఉందని వాదిస్తున్నారు. అనంతపురం చాంద్‌పాషాకు మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆయన ప్రత్యర్థి వర్గం వ్యతిరేకిస్తోంది. అంతగా ముస్లిం కోటాలో మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ షరీఫ్‌కు ఇవ్వమని వాదిస్తున్నారు. మొత్తంగా టీడీపీ ఇచ్చిన లీకు ఆయ‌న‌కే షాకు ఇచ్చింద‌ని చెప్తున్నారు.